అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Kurnool | సూపర్ హిట్ అయిన సినిమాల సీన్లు, పాటలు రీల్స్‌గా సోషల్ మీడియాను (Social media) షేక్ చేయడం సాధారణమే. కొందరు హీరోల స్టెప్పులు, డైలాగులు చేస్తే… మరికొందరు విలన్ డైలాగులతో ట్రెండ్ సెట్ చేస్తారు. అయితే రీల్ లైఫ్‌ను దాటి, సినిమాలో చూపించిన నేరాలనే నిజ జీవితంలో అనుకరించే స్థాయికి వెళ్లడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. గతంలో పుష్ప (Pushpa) సినిమాను అనుసరించి స్మగ్లింగ్ కేసులు వెలుగుచూశాయి. తాజాగా ఇదే తరహాలో, ఓ సినిమా సీన్‌ను తలపించే దారుణం ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఇటీవల విడుదలై భారీ విజయాన్ని అందుకున్న రాజు వెడ్స్ రాంబాయి (Raju weds Rambai) సినిమాలో ఓ షాకింగ్ సీన్ ఉంటుంది. ప్రేమ వ్యవహారం కారణంగా విలన్ తన కూతురికి హెచ్ఐవీ (HIV) వైరస్ ఉన్న ఇంజెక్షన్ ఇస్తాడు. ఈ సీన్ అప్పట్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఇప్పుడు అచ్చం అలాంటి ఘటననే నిజ జీవితంలో ఓ మహిళ అమలు చేయడం కలకలం రేపుతోంది.
Kurnool | కర్నూలులో ఏమైంది?
కర్నూలుకు చెందిన ఓ డాక్టర్‌కు Doctor చదువుకునే రోజుల్లో వసుంధర అనే మహిళతో పరిచయం ఏర్పడింది. కాలక్రమంలో వారి మధ్య విభేదాలు రావడంతో ఇద్దరూ విడిపోయారు. అనంతరం ఆ డాక్టర్ మరో మహిళను వివాహం చేసుకున్నాడు. ఆమె ప్రస్తుతం ఓ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తోంది. దంపతులు ఇద్దరూ సంతోషంగా జీవిస్తున్నారు. అయితే మాజీ ప్రియుడు మరో మహిళను పెళ్లి చేసుకోవడాన్ని వసుంధర జీర్ణించుకోలేకపోయింది. అతడి భార్యను తొలగించి, ఆ స్థానంలో తానే ఉండాలన్న వక్రీకృత ఆలోచనతో ముందుకు వెళ్లిందని పోలీసులు చెబుతున్నారు.
పోలీసుల దర్యాప్తులో బయటపడిన వివరాల ప్రకారం ఈ ఏడాది జనవరి 9న, అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ భార్య స్కూటీపై Scooty వెళ్తుండగా ప్రమాదం జరిగేలా ముందే ప్లాన్ చేశారు. బైక్‌తో ఢీ కొట్టి ఆమెను కిందపడేలా చేశారు, వెంటనే సాయం చేస్తున్నట్లు నటిస్తూ ముగ్గురు మహిళలు అక్కడికి చేరుకున్నారు. బాధితురాలిని ఆటోలో ఎక్కించారు. అప్పటికే ఆటోలో ఉన్న వసుంధర, ఆమెకిహెచ్ఐవీ వైరస్‌తో కూడిన ఇంజెక్షన్ ఉపయోగించిందట. ఇంజెక్షన్ వేస్తున్న సమయంలో బాధితురాలు పరిస్థితిని గ్రహించి గట్టిగా కేకలు వేసింది. దీంతో నిందితులు భయపడి అక్కడి నుంచి పారిపోయారు. స్థానికుల సహాయంతో ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించగా, సకాలంలో చికిత్స అందడంతో ప్రాణాపాయం తప్పింది. విషయం తెలుసుకున్న బాధితురాలి భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌లు పరిశీలించి సాంకేతిక ఆధారాలతో వసుంధరతో పాటు ఆమెకు సహకరించిన ఇతర మహిళలను అదుపులోకి తీసుకున్నారు.