అక్షరటుడే, హైదరాబాద్: Rajiv Gandhi Civils Abhayahastam : రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకం ద్వారా ఆర్థిక సహాయం పొందినవారిలో ఏడుగురు అభ్యర్థులు ఈ ఏడాది యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షలో విజయవంతంగా ఉత్తీర్ణులు కావడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
సివిల్స్ లో తెలంగాణ అభ్యర్థులు రాణించాలనే ఉద్దేశంతో ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకం ప్రారంభించిన తొలి ఏడాదిలోనే ఏడుగురు అభ్యర్థులు ప్రతిష్ఠాత్మక సివిల్ సర్వీసులకు ఎంపిక కావడం మన రాష్ట్రానికి గర్వకారణమని ముఖ్యమంత్రి అన్నారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి విజయం సాధించిన అభ్యర్థులు అందరినీ ముఖ్యమంత్రి హృదయపూర్వకంగా అభినందించారు. వారంతా దేశసేవలో, జాతి నిర్మాణంలో కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. యువత తమ కలలు, ఆశయాలను నిజం చేసుకునే విధంగా వారికి మద్దతు ఇవ్వడంలో, సాధికారత కల్పించడంలో తెలంగాణ ప్రజా ప్రభుత్వ ఎల్లప్పుడూ ముందుంటుందని సీఎం అన్నారు.
రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకం కింద ఆర్థిక సహాయం పొంది, ఈ ఏడాది UPSC పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన ఏడుగురు అభ్యర్థులు వీరే : ఇట్టబోయిన సాయి శివాని, పోతరాజు హరి ప్రసాద్, రాపర్తి ప్రీతి, బానోత్ నాగరాజ నాయక్, తొగరు సూర్యతేజ, గోకమల్ల ఆంజనేయులు, రామటెంకి సుధాకర్.
Rajiv Gandhi Civils Abhayahastam : ఏమిటీ రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం….
తెలంగాణ నుంచి సివిల్ సర్వీసెస్ పరీక్షలకు ప్రిప్రేర్ అయ్యే అభ్యర్థుల కోసం ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం అనే ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ప్రారంభించారు. మెయిన్స్ పరీక్షలకు అర్హత సాధించిన అభ్యర్థులకు ఈ పథకం కింద సంసిద్ధత కోసం ₹1 లక్ష అందిస్తారు.
ఏటా 400 మంది అభ్యర్థులకు సాయం చేస్తారు. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) తన ‘నిర్మాన్’ కార్యక్రమంలో భాగంగా ఈ సహాయం అందిస్తోంది.
Rajiv Gandhi Civils Abhayahastam : అర్హత…
SC, ST, OBC, మహిళలు, ఆర్థికంగా బలహీన వర్గాల (EWS) కేటగిరీకి చెందిన అభ్యర్థులు ఈ పథకానికి అర్హులుగా పేర్కొంటారు. అయితే, అభ్యర్థుల కుటుంబ వార్షిక ఆదాయం ₹8 లక్షల కంటే తక్కువగా ఉండాలనే నిబంధన ఉంది. తెలంగాణలో శాశ్వత నివాసితులకు మాత్రమే ఈ ఆర్థిక సాయం పొందే అవకాశం ఉంటుంది.