అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Rajinikanth | తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ శనివారం తెల్లవారుజామున తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఉదయం విఐపీ విరామ సమయంలో ఆలయానికి చేరుకున్న ఆయనకు తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devasthanam) అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేసి స్వామివారి దర్శనం చేయించారు.
దర్శనం అనంతరం రంగనాయక మండపం (Ranganayaka Mandapam)లో వేదపండితులు వేదాశీర్వచనం నిర్వహించగా, ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలను రజనీకాంత్‌కు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపలకు వచ్చిన సూపర్‌స్టార్‌ను ఒక్కసారి చూసేందుకైనా భక్తులు పెద్దఎత్తున పోటీపడ్డారు. దీంతో తిరుమల పరిసరాల్లో ప్రత్యేక సందడి నెలకొంది.
Rajinikanth | తలైవా సందడి
డిసెంబర్ 12న 75 ఏళ్లు పూర్తి చేసుకుని 76వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా రజనీకాంత్ తిరుమల దర్శనం చేసుకోవడం అభిమానులకు ప్రత్యేక ఆనందాన్ని కలిగించింది. కలియుగ దైవమైన తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి (Tirumala Sri Venkateswara Swamy)ని ఆయన తరచుగా దర్శించుకుంటూ ఉండటం తెలిసిందే. జీవితంలో ముఖ్యమైన సందర్భాలు, శుభకార్యాల సమయంలో స్వామివారి ఆశీస్సులు తీసుకోవడం రజనీకి ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యమని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. పుట్టినరోజు సందర్భంగా సినీ ప్రముఖులతో పాటు సామాన్య అభిమానులు కూడా సోషల్ మీడియా (Social Media) వేదికగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. వయస్సు పెరిగినా ఆయనలోని ఎనర్జీ, క్రమశిక్షణ చూసి అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
రజనీకాంత్ సినీ ప్రయాణం విషయానికి వస్తే, 1975లో విడుదలైన ‘అపూర్వ రాగంగళ్’తో నటుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆయన ఈ ఏడాది నట జీవితంలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఆగస్టు 15న ఈ స్వర్ణోత్సవాన్ని ఘనంగా జరుపుకున్న రజనీకి, గోవాలో జరిగిన అంతర్జాతీయ చిత్రోత్సవం (IFFI)లో ప్రత్యేక సత్కారం కూడా లభించింది. భారతీయ సినిమా చరిత్రలో తనదైన ముద్ర వేసిన నటుడిగా ఆయనకు ఈ గౌరవం దక్కడం అభిమానులకు గర్వకారణంగా మారింది. ఈ సందర్భంగా మాట్లాడిన రజనీకాంత్, తనకు మళ్లీ జన్మంటూ ఉంటే రజినీకాంత్లాగే పుట్టాలని కోరుకుంటున్నానంటూ భావోద్వేగంగా స్పందించారు ఇటీవల ఆయన పుట్టినరోజు సందర్భంగా క్లాసిక్ మూవీ ‘పడయప్ప’ రీ రిలీజ్ కావడంతో థియేటర్లలో పండగ వాతావరణం కనిపించింది. పాత తరం అభిమానులతో పాటు కొత్త తరం ప్రేక్షకులు కూడా ఈ చిత్రాన్ని పెద్ద తెరపై చూసేందుకు ఆసక్తి చూపించారు. ఇది రజనీకాంత్ ఇమేజ్ తరాలను దాటి కొనసాగుతోందనడానికి మరో నిదర్శనంగా నిలిచింది. అభిమానులు ఆయన నుంచి ఇంకా ఎన్నో సినిమాలు, మరెన్నో మైలురాళ్లు చూడాలని ఆశిస్తున్నారు.