అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Rajasthan | రాజస్థాన్ రాష్ట్రంలో జరిగిన ఓ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఫేస్‌బుక్ (Face Book) ద్వారా పరిచయమైన ఓ మహిళ, ప్రేమ కోసం వందల కిలోమీటర్లు ప్రయాణించి ప్రియుడిని కలిసిన అనంతరం, తాను వచ్చిన కారులోనే శవమై కనిపించింది.
పోలీసులు ఈ దారుణ ఘటనపై దర్యాప్తు చేపట్టగా.. దుశ్చర్య వెనకున్న అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. వివరాల్లోకి వెళితే.. ఝున్‌ఝున్‌కు (Jhunjhun) చెందిన ముకేశ్ కుమారి, అంగన్‌వాడీ సూపర్‌వైజర్‌గా పనిచేస్తోంది. పదేళ్ల క్రితమే ఆమె భర్తతో విడాకులు తీసుకుంది. గత ఏడాది ఫేస్‌బుక్ ద్వారా బార్మేర్‌కు (Barmer) చెందిన మనారామ్ అనే స్కూల్ టీచర్‌తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం క్రమంగా ప్రేమగా మారింది. ఇద్దరూ తరచూ మాట్లాడుకుంటూ, కలిసి జీవితాన్ని గడపాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
Rajasthan | ప్రియుడి చేతిలో హత్య..
అయితే, మనారామ్ వివాహితుడు కాగా, తన భార్యతో విభేదాల కారణంగా విడిపోయాడు. వారి విడాకుల కేసు ఇంకా కోర్టులో నడుస్తోంది. ముకేశ్ కుమారి మాత్రం పెళ్లి విషయాన్ని సీరియస్‌గా తీసుకుని, మనారామ్‌ను పెళ్లి చేసుకోవాలంటూ పలు మార్లు ఒత్తిడి చేసింది. ఈ నెల 10న ముకేశ్ కుమారి తన ఆల్టో కారులో దాదాపు 600 కిలోమీటర్లు ప్రయాణించి, బార్మేర్‌లోని మనారామ్ ఇంటికి వెళ్లింది. అతడి కుటుంబానికి తాము ప్రేమించుకుంటున్నామని చెప్పింది. అయితే ఆ సమయంలో మనారామ్‌తో ఆమెకు తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వగా, వారు వచ్చి సర్దిచెప్పారు.
అదే రోజు సాయంత్రం, మనారామ్ – ముకేశ్ కుమారి ఇద్దరూ కలిసి ఒక నిర్మానుష్య ప్రాంతానికి కారులో వెళ్లారు. అక్కడ మనారామ్ ఇనుప రాడ్‌తో ఆమె తలపై దాడి చేసి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని కారులోనే వదిలి, తాను ఇంటికి వెళ్లిపోయాడు. రెండ్రోజుల తర్వాత స్థానికులు ఆ పార్క్ చేసిన కారును అనుమానంతో గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, ముకేశ్ కుమారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. దర్యాప్తులో భాగంగా ముకేశ్ కుమారి, మనారామ్‌ల ఫోన్ సిగ్నల్స్ ఒకేసారి ఒకే ప్రాంతంలో నమోదైనట్టు గుర్తించారు. మనారామ్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని ఒప్పుకున్నాడు. పోలీసులు అతనిపై హత్యారోపణలతో కేసు నమోదు చేసి, దర్యాప్తు కొనసాగిస్తున్నారు.