అక్షరటుడే, లింగంపేట: Lingampet | రాజశ్రీ కోళ్ల పెంపకంతో ఆర్థిక స్వావలంబన సాధించవచ్చని పీవీ నరసింహారావు పశువైద్య విశ్వవిద్యాలయం పరిధిలోని కోళ్ల పరిశోధన సంస్థ ప్రతినిధి దేశకృష్ణ పేర్కొన్నారు. లింగంపేట మండలం (Lingampet mandal) బానాపూర్ తండా, జగదాంబ తండాలో ట్రైబల్ సబ్‌ప్లాన్ ఆధ్వర్యంలో రాజశ్రీ కోళ్లను గిరిజనులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజశ్రీ కోళ్ల ద్వారా స్వయం ఉపాధితో పాటు పౌష్టిక ఆహారం అందించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామన్నారు. అలాగే అధిక గుడ్లను (Rajashree eggs) ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉన్న రాజశ్రీ కోళ్లను తండాల్లో పంపిణీ చేస్తున్నామన్నారు. చౌకగా దొరికే కోడి గుడ్డు, కోడి మాంసాన్ని ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురావడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.
జిల్లా పశు వైద్యాధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేదలు వాణిజ్య పరంగా కోళ్లఫారం ప్రారంభించాలంటే ఎంతో వ్యయంతో కూడుకున్న పని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎలాంటి పెట్టుబడి లేకుండా ఇంటి పరిసర ప్రాంతాల్లో దొరికే వడ్లు, జొన్నలు, పురుగులను రాజశ్రీ కోళ్లు తింటాయని చెప్పారు. వాటిని మాంసం, గుడ్లుతో గ్రామీణ గిరిజనులకు లబ్ధి పొందవచ్చని సూచించారు. కార్యక్రమంలో పశువైద్యులు అనిల్, పవన్ కుమార్, రవి, హన జోన్స్, ఏలేటి రాజు, సర్పంచ్ పీర్సింగ్, జగదంబా తండా సర్పంచ్, ఉప సర్పంచ్‌లు, వార్డు మెంబర్లు పాల్గొన్నారు.