అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Raj Gopal Reddy | ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై సొంత పార్టీకి చెందిన సీనియర్ నేత ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి అసహనం వ్యక్తం చేశారు. సీఎం వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ (Congress Party) విధానాలకు వ్యతిరేకమని పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన ఓ పోస్టు పెట్టారు. నాగర్ కర్నూలు జిల్లాలో శుక్రవారం జరిగిన పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) అక్కడ నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా కేసీఆర్, కేటీఆర్ పై విరుచుకు పడిన ఆయన.. పదేళ్ల పాటు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల్లో గత కొన్నేళ్లుగా ఒక పార్టీ వరుసగా రెండేళ్లు అధికారంలో ఉండడం ఆనవాయితీగా వస్తోందని చెబుతూ, వచ్చే పదేళ్లు కూడా తానే ముఖ్యమంత్రిగా ఉంటానని ప్రకటించారు. అయితే, సీఎం చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీకి చెందిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి(MLA Komatireddy Rajgopal Reddy) అసంతృప్తి వ్యక్తం చేశారు.
Raj Gopal Reddy | కార్యకర్తలు సహించరు…
సీఎం పదేళ్ల వ్యాఖ్యలపై రాజగోపాల్ సోషల్ మీడియా(Social Media)లో ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి తీరును తప్పు పట్టారు. పదేళ్లు నేనే సీఎం అని రేవంత్ రెడ్డి ప్రకటించుకోవడం కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకమని పేర్కొన్నారు. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్‌లో అధిష్ఠానం ఆదేశాల మేరకు ప్రజాస్వామ్య బద్ధంగా ముఖ్యమంత్రి ఎన్నిక ఉంటుందని వ్యాఖ్యానించారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీని వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలను నిఖార్సయిన కాంగ్రెస్ నాయకులు (Congress Leaders) కార్యకర్తలు సహించరని హెచ్చరించారు.
Raj Gopal Reddy | అసంతృప్తిలో కోమటిరెడ్డి సోదరులు..
సీఎంపై రాజగోపాల్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌తో పాటు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. మంత్రిపదవి రాక ఆయన ఇప్పటికే తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. అమాత్యుడిగా చేయాలన్న తన కల నెరవేరక పోవడంతో కాంగ్రెస్ పెద్దలపై గుర్రుగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అప్పుడప్పుడు పార్టీని, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారు. అదే ధోరణిని కంటిన్యూ చేస్తూ తాజాగా అవే తరహాలో వ్యాఖ్యలు చేశారు. రేవంత్‌రెడ్డి సీఎం కావడం కోమటిరెడ్డి సోదరులకు మొదటి నుంచి ఇష్టం లేదు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సీఎం పదవిపై కన్నేయగా, కాంగ్రెస్ హైకమాండ్ (Congress Highcommand) ఆయనను మంత్రి పదవికే పరిమితం చేసింది. ఈ నేపథ్యంలో ఆయన కూడా తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి అయ్యేందుకు తనకు అన్ని అర్హతలు ఉన్నాయని, తన స్థాయి కేసీఆర్‌తో సమానమని, రేవంత్‌రెడ్డిది కేటీఆర్(KTR) స్థాయి అని వెంకట్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇటీవల చర్చనీయాంశమయ్యాయి. తాజాగా ఆయన సోదరుడు చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చకు దారి తీశాయి.