అక్షరటుడే, వెబ్‌డెస్క్ : MLA Komati Reddy | రాష్ట్రవ్యాప్తంగా నూతన వైన్ షాపు(Wine Shop)ల కోసం టెండర్ల ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన నియోజకవర్గంలో మద్యం షాపులపై ఊహించని షరతులు విధించారు. త్వరలో ముగియనున్న ఈ టెండర్ ప్రక్రియలో పాల్గొనాలని అనుకున్న వ్యాపారులకు కొన్ని కీలక నిబంధనలు విధించామని స్పష్టం చేస్తూ ప్లెక్సీలు ఏర్పాటు చేశారు.
MLA Komati Reddy | ఎమ్మెల్యే పేర్కొన్న షరతులు ప్రకారం:
- వైన్ షాపులు గ్రామ లేదా పట్టణ సరిహద్దులకు వెలుపల మాత్రమే ఉండాలి
- షాపులకు అనుబంధంగా సిట్టింగ్ అరేంజ్‌మెంట్(Seating Arrangement) నిషేధం
- బెల్ట్ షాపులకు మద్యం అమ్మకాలు కఠినంగా నిషేధం
- షాపు యజమానులు సిండికేట్‌లుగా ఏర్పడరాదు, ధరలు ఇష్టానుసారంగా పెంచితే చర్యలు తప్పవు
- ప్రతిరోజూ సాయంత్రం 4గంటల నుంచి రాత్రి 9గంటల వరకే మద్యం అమ్మకాలు జరగాలి
- ఈ షరతులను పాటించనివారు టెండర్లకు దరఖాస్తు చేయవద్దని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు
ఈ రూల్స్‌ను ప్రజలపై రుద్దడానికి కాదని, ప్రజల ఆరోగ్యం, మహిళల సాధికారత, బెల్ట్ షాపుల నిర్మూలన కోసం తీసుకున్న చర్యలుగా ఆయన స్పష్టం చేశారు. “తాగుడు పూర్తిగా వ్యతిరేకించను కానీ, ఉదయం నుంచి సాయంత్రం వరకు తాగి జీవితాన్ని నాశనం చేసుకునే అలవాటుకు మాత్రం వ్యతిరేకం” అని వ్యాఖ్యానించారు.
ఈ నేపథ్యంలో మునుగోడులోని పలు మండలాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ(Congress Party) నేతలు సోమవారం నల్గొండ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో వినతిపత్రాలు సమర్పించారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి(MLA Komati Reddy) సూచనలు, షరతుల అమలును అధికారికంగా అధికారులకు తెలియజేశారు.ఇదిలా ఉండగా, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ విషయాలపై మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయన తీసుకున్న ఈ వినూత్న చర్యపై ప్రజల నుండి మిశ్రమ స్పందన వస్తోంది. కొందరు అభినందిస్తుండగా, మరికొందరు ఇది వ్యాపార స్వేచ్ఛకు భంగం కలిగించడమేనని అభిప్రాయపడుతున్నారు. అయితే ప్రజల ఆరోగ్యం, కుటుంబాల సంక్షేమం కోసం ఒక ప్రజా ప్రతినిధిగా ఈ చర్యలు తీసుకోవడం ప్రశంసనీయం అనే అభిప్రాయాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.