అక్షరటుడే, వెబ్డెస్క్ : Raja Singh | గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja Singh) బీజేపీ (BJP)పై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రాంచందర్రావు ఎన్నిక కావడంతో ఆయన పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. పార్టీలోని పలువురు నాయకులపై ఇటీవల ఆయన వరుస కామెంట్లు చేస్తున్నారు. తాజాగా బీజేపీలో చేరికలపై మరోసారి మాట్లాడారు.
అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు (Guvvala Balaraju) ఇటీవల బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. అలాగే పలువురు మాజీ ఎమ్మెల్యేలు సైతం పార్టీలో చేరుతారని రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు (Ramchandar Rao) ప్రకటించారు. ఈ నేపథ్యంలో రాజాసింగ్ మంగళవారం పార్టీలో చేరేవారిని హెచ్చరించారు. బీజేపీలో చేరే ముందు గతంలో పార్టీని వీడిన వారితో చర్చించాలని సూచించారు. నాగం జనార్దన్ రెడ్డి, విజయశాంతి, జితేందర్ రెడ్డి ఎందుకు బీజేపీలో చేరి మళ్లీ వెళ్లిపోయారో ఆలోచించాలన్నారు.
Raja Singh | ఏమి చేయలేరు
ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరిన వారు ఏమి చేయలేరని రాజాసింగ్ అన్నారు. ‘మీరు అనుకున్నది నియోజకవర్గంలో జరగదు’ అని చెప్పారు. కార్యకర్తలకు ఏ పదవి ఇప్పించలేరని హెచ్చరించారు. అసలు చేరిన వారికి టికెట్ వస్తుందనే గ్యారెంటీ లేదన్నారు. కొత్తగా పార్టీలో చేరిన వారు మొదట్లో ఫస్ట్ సీట్లో ఉంటారని, తర్వాత క్రమంలో లాస్ట్ సీట్లోకి తోసేస్తారని పేర్కొన్నారు.
Raja Singh | వారు నాశనం అవుతారు
తెలంగాణ బీజేపీలో కొంతమంది రాక్షసులు ఉన్నారని రాజాసింగ్ అన్నారు. ఈరోజు కాకపోతే రేపైనా ఆ రాక్షసులు నాశనం అవుతారన్నారు. అయితే కొత్తగా చేరేవారు మాత్రం చేరాక ఎలాంటి బాధలు భరించాలో.. పార్టీ విడిచిపెట్టిన వెళ్లిన వారిని అడగాలని సలహా ఇచ్చారు.