అక్షరటుడే, హైదరాబాద్: Raja Saab and Shankar Varaprasad : చిరంజీవి మన శంకరవరప్రసాద్,ప్రభాస్ రాజా సాబ్ చిత్ర నిర్మాతలు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. చిత్రాల అదనపు షోకు అనుమతి, టికెట్ ధర పెంపునకు అనుమతి ఇవ్వాలని అప్పీల్ పిటిషన్ దాఖలు చేయడం గమనార్హం.
అదనపు షోలకు అనుమతి ఇవ్వకుండా, టికెట్ ధరలు పెంచకుండా గతంలో హైకోర్టు సింగిల్ బెంచ్ ఉత్తర్వులు ఇచ్చింది. కాగా, సింగిల్ బెంచ్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ రాజాసాబ్, మన శంకర వరప్రసాద్ చిత్ర నిర్మాతలు హైకోర్టు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించారు.
Raja Saab and Shankar Varaprasad : హోంశాఖ కార్యదర్శికి..
సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను సస్పెండ్ చేయడం ద్వారా టికెట్ ధరలు పెంచేందుకు, ప్రత్యేక షోల ప్రదర్శనకు అనుమతి ఇవ్వాలని విన్నవించారు. ఈ విషయంలో ఇప్పటికే రాష్ట్ర హోంశాఖ కార్యదర్శికి దరఖాస్తు చేసుకున్నట్లు వివరించారు. తమ విజ్ఞప్తిని పరిశీలించేలా హోంశాఖ కార్యదర్శికి ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు.
కాగా, నిర్మాతల తరఫు న్యాయవాదుల విన్నపాన్ని హైకోర్టు తిరస్కరించింది. సదరు పిటిషన్లపై బుధవారం (జనవరి 7) విచారణ చేపడతామని హైకోర్టు పేర్కొంది. సంక్రాంతి సందర్భంగా ఈ సినిమాలు విడుదల అవుతున్నాయి. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.