అక్షరటుడే, వెబ్‌డెస్క్: Raj tarun | టాలీవుడ్ యువ హీరో రాజ్ తరుణ్ (Hero Raj tarun) ఇటీవల సినిమాల కన్నా కూడా వివాదాలతో ఎక్కువగా వార్తలలో నిలుస్తున్నారు. గతంలో రాజ్ తరుణ్- లావణ్యల (Raj Tarun-Lavanya) ఇష్యూ ఎంత పెద్ద హాట్ టాపిక్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు వారి వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది.
రాజ్ తరుణ్ తనపై దాడి చేయించి.. దోపిడీకి పాల్పడ్డారని పేర్కొంటూ లావణ్య ఫిర్యాదు చేయగా.. నార్సింగి పోలీసులు (Narsingi police) అతడిపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు రాజ్ తరుణ్‌తో పాటు మరో ఐదుగురి పేర్లను కూడా ఎఫ్ఐఆర్‌లో చేర్చారు. కాగా.. రాజ్ తరుణ్ మరోసారి వివాదంలో చిక్కుకోవడంతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
Raj tarun | మళ్లీ చిక్కుల్లో..
కోకాపేటలోని విల్లాలో తనపై దాడి జరిపించాడంటూ లావణ్య అనే మహిళ నార్సింగి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు వెలుగులోకి వచ్చింది. లావణ్య ఫిర్యాదు మేరకు పోలీసులు (Police) రాజ్ తరుణ్‌తో పాటు మరో ఆరుగురిపై కేసు నమోదు చేశారు. లావణ్య తెలిపిన వివరాల ప్రకారం.. తాను 2016లో రాజ్ తరుణ్‌తో కలిసి కోకాపేటలో (Kokapet) విల్లా కొనుగోలు చేసినట్లు తెలిపారు. వ్యక్తిగత విభేదాల కారణంగా 2024 మార్చిలో ఆయన ఇంటిని ఖాళీ చేసినట్లు చెప్పారు. అయితే ఇప్పటికీ ఆ ప్రాపర్టీకి సంబంధించిన వివాదం కోర్టులో పెండింగ్‌లో ఉందని పేర్కొన్నారు.
అయినా కూడా ఇటీవల తాను ఆ విల్లాలో ఉన్న సమయంలో రాజ్ తరుణ్ అనుచరులు విచక్షణారహితంగా దాడి చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడిలో బెల్టులు, గాజు సీసాలు వాడినట్లు, తాను ధరించిన బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లినట్లు ఫిర్యాదులో వివరించారు. అంతేకాదు, తన పెంపుడు కుక్కలను (pet dogs) కూడా చంపేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై రాజ్ తరుణ్‌తో పాటు మణికంఠ తంబాడీ, రాజ్ శేఖర్, సుశి, అంకిత్ గౌడ్, రవితేజలపై కూడా కేసు నమోదైంది. ప్రస్తుతం ఈ కేసును నార్సింగి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో టాలీవుడ్ వర్గాల్లో సంచలనం రేగింది. ఇప్పటికే వివాదాల్లో చిక్కిన రాజ్ తరుణ్‌పై మళ్లీ క్రిమినల్ కేసు నమోదు కావడంతో ఆయన ఇమేజ్‌కు తీవ్ర దెబ్బ తగిలే అవకాశముంది. కాగా ఈ విషయంపై రాజ్ తరుణ్ ఇంకా స్పందించలేదు.