అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Flash Floods | ఉత్తర భారత దేశంలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. మంగళవారం ఉత్తరాఖండ్‌లోని ఉత్తర కాశీలో క్లౌడ్ బరస్ట్ కావడంతో ఏకంగా ఒక గ్రామం కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. తాజాగా హిమాచల్ ప్రదేశ్‌లో (Himachal Pradesh) వర్షాలు బీభత్సం సృష్టించాయి. రాష్ట్రంలో కిన్నౌర్ టాంగ్లింగ్ ఖాడ్‌లో (Kinnaur Tangling Khad) మెరుపు వరదలు చోటు చేసుకున్నాయి.
వరద ఉధృతికి పలు వంతెనలు కొట్టుకుపోయాయి. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు కిన్నౌర్ కైలాస్ యాత్రను (Nanur Kailash Yatra) నిలిపి వేశారు. మనాలీ-చండీగఢ్ రహదారి దెబ్బతినగా.. సిమ్లా-చండీగఢ్, పఠాన్‌కోట్-కాంగ్రా మార్గాల్లో కొండచరియలు విరిగి పడ్డాయి. దీంతో రాకపోకలు నిలిచిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కిన్నౌర్ జిల్లా ఫూ బ్లాక్‌లోని రిబ్బా నల్లా సమీపంలోని రాల్డాంగ్ ఖాడ్ (Raldang Khad) వద్ద ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. దీంతో నేషనల్ హైవే 5పై రాకపోకలు నిలిచిపోయాయి. అయితే వరదలతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.
Flash Floods | నిలిచిపోయిన కైలాస్ యాత్ర
భారీ వర్షాలు(Heavy Rains), వరదల నేపథ్యంలో కిన్నర్ కైలాస్ యాత్ర నిలిచిపోయింది. వంతెన కొట్టుకుపోవడంతో చిక్కుకుపోయిన 400 మంది యాత్రికులను అధికారులు రక్షించారు. రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. సిమ్లా, సోలన్, ఉనా, హమీర్‌పూర్, మండి, బిలాస్‌పూర్, కాంగ్రా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
Flash Floods | 295 రోడ్లు మూసివేత
హిమాచల్ ప్రదేశ్‌లో కుండపోత వానలు, ఆకస్మిక వరదలతో మండి జిల్లాలో (Mandi District) అత్యధికంగా నష్టం జరిగింది. ఈ జిల్లాలో 179 మి.మీ. కంటే ఎక్కువ వర్షపాతం నమోదు కావడం గమనార్హం. వరదల ధాటికి రెండు జాతీయ రహదారులతో పాటు 295 రోడ్లను అధికారులు మూసి వేశారు. అధికారులు సహాయక చర్యల కోసం బృందాలను ఏర్పాటు చేశారు.
Flash Floods | ధరాలీలో కొనసాగుతున్న సహాయక చర్యలు
ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లా ధరాలీ గ్రామం మంగళవారం కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. రెండు గంటల వ్యవధిలో రెండు సార్లు క్లౌడ్ బరస్ట్ కావడంతో వరదలు గ్రామాన్ని ముంచెత్తాయి. ఈ ఘటనలో పలువురు మృతి చెందగా.. 70 మందికి పైగా గల్లంతయ్యారు. మంగళవారం నుంచి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వరదల్లో ఆర్మీ బేస్ క్యాంపు కూడా కొట్టుకుపోయింది. దీంతో 11 మంది సైనికులు గల్లంతయ్యారు.
Flash Floods | తమిళనాడులో..
తమిళనాడు రాష్ట్రాన్ని సైతం భారీ వర్షాలు ముంచెత్తాయి. నీలగిరి, విరుదునగర్ జిల్లాలకు అధికారులు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు. కోయింబత్తూర్, తేని సహా 10 జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. వర్షాల నేపథ్యంలో అధికారులు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు.