అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hyderabad | హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో శనివారం సాయంత్రం వాన దంచికొట్టింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
రెండు రోజులుగా నగరంలో భారీ వర్షం (Heavy Rains) పడుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శనివారం శేరిలింగంపల్లి, నల్లగండ్ల, మియాపూర్, మదీనాగూడ, చందానగర్, లింగంపల్లి, హఫీజ్‌పేట్, కొండాపూర్, మాదాపూర్, కూకట్‌పల్లి, జూబ్లీహిల్స్, బంజరాహిల్స్, పంజాగుట్ట ప్రాంతాల్లో వర్షం పడింది.
ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్, మలక్ పేట్, కోటి, అబిడ్స్, లక్డికాపుల్, బషీర్ బాగ్‌లో భారీ వర్షానికి రోడ్ల పై వరద నీరు చేరడంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. దీంతో ట్రాఫిక్ జామ్ (Traffic Jam)తో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. మియాపూర్ నుంచి లింగంపల్లి మార్గంలో వాహనాలు స్తంభించిపోయాయి. ఓవైపు వర్షం, మరోవైపు రోడ్డు మధ్యలో జరుగుతున్న డ్రైనేజీల పనుల వల్ల.. చందానగర్ నుంచి మియాపూర్ మార్గంలోనూ ట్రాఫిక్ నెమ్మదిగా కదులుతోంది.
Hyderabad | మూసీకి భారీ వరద
హైదరాబాద్‌లో కురుస్తున్న భారీ వర్షాలతో మూసీ నది (Musi River) ఉగ్రరూపం దాల్చింది. ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ నిండుకుండలా మారడంతో అధికారులు గేట్లు ఎత్తి మూసీలోకి నీటిని వదులుతున్నారు. దీంతో నగరంలో మూసీ ఉధృతంగా పారుతోంది. నది పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
రోడ్లపై వరద నీరు నిల్వకుండా ట్రాఫిక్ పోలీసులు, హైడ్రా (Hydraa), జీహెచ్ఎంసీ (GHMC) సిబ్బంది చర్యలు చేపడుతున్నారు. నీరు నిలిచిన ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపడుతున్నారు.