అక్షరటుడే, వెబ్డెస్క్: Himachal Pradesh | ఉత్తరాది రాష్ట్రాల్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కొద్దిరోజులుగా భారీ వర్షాలు(Heavy Rains) పడుతుండడంతో జనజీవనం అతలాకుతలం అయింది. ముఖ్యంగా ఉత్తరాఖండ్(Uttarakhand), హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో వరదలు, కొండ చరియలు విరిగిపడటంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు.
హిమాచల్ ప్రదేశ్(Himachal Pradesh)లో మంగళవారం రాత్రి కుండపోత వర్షం కురిసింది. క్లౌడ్ బరస్ట్ కారణంగా భారీ వర్షాలు పడ్డాయి. ముఖ్యంగా మండి జిల్లాలో 16 వరకు మేఘాల విస్ఫోటనాలు నమోదయ్యాయి. దీంతో వరదల దాటికి దాదాపు వంద ఇళ్లు కొట్టుకుపోయాయి. చాలా మంది వరదల్లో గల్లంతయ్యారు. వర్షాలతో ఇప్పటి వరకు 18 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. అధికారులు, సహాయక బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నాయి. గల్లంతైన వారి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. మరోవైపు వర్షాల కారణంగా కొండ చరియలు విరిగిపడడంతో పలు మార్గాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. వరదల్లో వాహనాలు కొట్టుకుపోయాయి. అధికారులు రోడ్లపై పడ్డ కొండచరియలను తొలగించి రాకపోకలు పునరుద్ధరించడానికి చర్యలు చేపట్టారు.