అక్షరటుడే, వెబ్డెస్క్: Weather Updates | రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శనివారం వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు (Meteorological Department Officers) తెలిపారు. సాయంత్రం, రాత్రి పూట మోస్తరు వాన పడే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు. హైదరాబాద్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. ఉదయం నుంచే అకాశం మేఘావృతమై ఉంటుంది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడన ప్రభావంతో జులై 1 నుంచి 3 వరకు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. శుక్రవారం కూడా పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడ్డాయి. దీంతో రైతులు (Farmers) హర్షం వ్యక్తం చేస్తున్నారు. వరుస వర్షాలతో వ్యవసాయ పనుల్లో నిమగ్నం అయ్యారు. దీంతో రాష్ట్రంలో వరి నాట్లు జోరందుకున్నాయి. పలు ప్రాంతాల్లో ఇప్పటికే వరినాట్లు పూర్తి కాగా.. మరికొన్ని ప్రాంతాల్లో ప్రస్తుతం నాట్లు వేస్తున్నారు.
Weather Updates | ఉత్తరాదిలో వర్ష బీభత్సం
ఉత్తరాది రాష్ట్రాల్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరాఖండ్ (Uttarakhand), హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh)లో వానలు దంచికొడుతుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హిమాచల్ ప్రదేశ్లోని పలు జిల్లాల్లో క్లౌడ్ బరస్ట్ అయి కుండపోత వానలు కురిశాయి. దీంతో ఇప్పటి వరకు 63 మంది మృతి చెందగా పలువరు గల్లంతయ్యారు. వందల సంఖ్యలో ఇళ్లు కొట్టుకుపోయాయి. రూ.400 కోట్లకు పైగా నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేశారు.
దేవభూమి ఉత్తరాఖండ్లో సైతం వర్షాలు పడుతున్నాయి. ప్రస్తుతం పటిష్ట భద్రత మధ్య చార్ధామ్ యాత్ర (Char Dham Yatra) సాగుతోంది. వర్షాలతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొండ చరియలు విరిగిపడడంతో ఇటీవల యాత్రను తాత్కాలికంగా నిలిపి వేసిన అధికారులు, మళ్లీ ప్రారంభించారు.