అక్షరటుడే, వెబ్డెస్క్ : Weather Updates | బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం శనివారం తీరం దాటింది. దీంతో రాష్ట్రంలో వర్షాలు (Rains) తగ్గుముఖం పడుతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
అల్పపీడన (LPA) ప్రభావంతో గత నాలుగు రోజులుగా తెలంగాణవ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి. శనివారం సైతం పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. అయితే ఆదివారం నుంచి వర్షాలు తగ్గుతాయని అధికారులు తెలిపారు. ఆదివారం సాయంత్రం వరకు వాతావరణం పొడిగా ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో చిరు జల్లులు కురుస్తాయి. సాయంత్రం నుంచి రాత్రి వరకు పలు చోట్ల మోస్తరు వర్షాలు పడుతాయి.
Weather Updates | తేరుకుంటున్న హైదరాబాద్
మూసీ నది (Musi River) శాంతించడంతో హైదరాబాద్ (Hyderabad) నగరం తేరుకుంటుంది. గురు, శుక్రవారాల్లో కురిసిన భారీ వర్షానికి మూసీ నదికి వరద ముంచెత్తిన విషయం తెలిసిందే. దీంతో మహానగరంలోని పలు ప్రాంతాలను వరద ముంచెత్తింది. ఎంజీబీఎస్ బస్టాండ్ నీట మునిగింది. పలు మార్గాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. శనివారం వాన పడకపోవడంతో మూసీకి వరద తగ్గింది.
Weather Updates | మరో అల్పపీడనం
అల్పపీడన ముప్పు తప్పిందని ప్రజలు సంతోషిస్తుండగా.. వాతావరణ శాఖ అధికారులు మరో బాంబు పేల్చారు. అక్టోబర్ 1న బంగాళాఖాతంలో మరో అల్ప పీడనం ఏర్పడుతుందని చెప్పారు. దీంతో మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
వరుసగా కురుస్తున్న వర్షాలతో రైతులు (Farmers) ఆందోళన చెందుతున్నారు. భారీ వర్షాలతో ఇప్పటికే పంటలకు తెగుళ్లు ఆశించాయి. ముందస్తుగా సాగు చేసిన ప్రాంతాల్లో వరి కోతకు వచ్చింది. అయితే వానలు పడుతుండటంతో కోతలపై రైతులు ఆందోళన చెందుతున్నారు. పొలాలు ఎలా కోయాలని, వడ్లు ఎక్కడ ఆరబోయాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.