అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Weather Updates | మొంథా తుపాన్ (Cyclone Montha) ప్రభావంతో రాష్ట్రంలో మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. మధ్య తెలంగాణలో బుధవారం కుండపోత వాన కురిసింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గురువారం సైతం వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ (IMD) అధికారులు హెచ్చరించారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుపాన్ బుధవారం తెలంగాణ వైపు పయనించిన విషయం తెలిసిందే. దీని ప్రభావంతో పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిశాయి. ప్రస్తుతం తుపాన్ బలహీన పడింది. దీంతో వర్షాలు తగ్గుముఖం పడుతాయని అధికారులు తెలిపారు. అయితే ఉదయం నుంచి చలిగాలులు వీస్తాయి. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. నిజామాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల, జగిత్యాల, భూపాలపల్లి, పెద్దపల్లి, వికారాబాద్ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతాయి. మిగతా ప్రాంతాల్లో చెదురుమొదరు జల్లులు కురిసే అవకాశం ఉంది.
Weather Updates | కుండపోత వర్షాలు
మొంథా తుపాన్ ప్రభావంతో బుధవారం పలు జిల్లాల్లో కుండపోత వర్షం కురిసింది. వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, సిద్దిపేట, కరీంనగర్, సిరిసిల్ల, భువనగిరి, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు పడ్డాయి. ప్రస్తుతం తుపాన్ ముప్పు తప్పినప్పటికీ ఉత్తర తెలంగాణ (North Telangana) జిల్లాల్లో సాయంత్రం, రాత్రి పూట వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. కాగా బుధవారం పలు జిల్లాల్లో రికార్డు స్థాయిలో వర్షం పడింది. హన్మకొండ జిల్లా భీమదేవునిపల్లిలో 422 మి.మీ. వర్షపాతం నమోదైంది. వరంగల్ జిల్లా కల్లెడ 415, రెడ్లవాడలో 358, హన్మకొండ జిల్లా ధర్మసాగర్లో 334, వరంగల్ జిల్లా కాపులకాంపర్తిలో 332.8, వర్దన్నపేట 324, సంగెంలో 310, సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో 304 మి.మీ. వర్షం కురిసింది.
Weather Updates | ఉమ్మడి వరంగల్ అతలాకుతలం
మొంథా తుపాన్ ప్రభావంతో ఉమ్మడి వరంగల్ (Warangal) జిల్లా అతలాకుతలం అయింది. కొన్ని గంటల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వాన పడింది. రికార్డు స్థాయిలో 42.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో వరద ముంచెత్తింది. దీంతో అధికారులు గురువారం ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. వరంగల్‌లోని హంట్రోడ్ లోని సోషల్ వెల్ఫేర్ హాస్టల్లోకి వరద నీరు చేరింది. దీంతో అధికారులు విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

