అక్షరటుడే, వెబ్డెస్క్ : Weather Updates | తెలంగాణలోని పలు ప్రాంతాల్లో బుధవారం వర్షం పడే అవకాశం ఉందని వాతావారణ శాఖ అధికారులు తెలిపారు.
రాష్ట్రంలోని వికారాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్, నారాయణపేట, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు (Moderate Rains) పడుతాయి. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షం కురుస్తుంది. ఉదయం నుంచి వాతావరణం మేఘావృతమై ఉంటుంది. హైదరాబాద్ (Hyderabad) నగరంలో సాయంత్రం, రాత్రి పూట తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది.
Weather Updates | రైతుల ఆందోళన
రాష్ట్రాన్ని వానలు వీడకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. భారీ వర్షాలతో తెలంగాణవ్యాప్తంగా రెండు లక్షలకు పైగా ఎకరాల్లో పంట నష్టం జరిగింది. నిత్యం వాన పడుతుండటంతో వరికి తెగుళ్లు ఆశిస్తున్నాయి. కంకినల్లి (Kanki Nalli) సోకి ధాన్యం తాలుగా మారిపోతుంది. దీంతో దిగుబడి తగ్గుతుందని రైతులు పేర్కొంటున్నారు. కాటుక (Katuka) తెగులు సైతం పలు ప్రాంతాల్లో ఆశిస్తోంది. మరోవైపు ముందస్తుగా సాగు చేసిన వరి పంట వారం పది రోజుల్లో కోతకు రానుంది. అయితే వర్షాలు పడుతుండటంతో కోతలు ఎలా అని రైతులు ఆందోళన చెందుతున్నారు.
Weather Updates | ఉధృతంగా పారుతున్న నదులు
రాష్ట్రంలో, ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో నదులకు వరద పోటెత్తింది. కృష్ణా (Krishna), గోదావరి (Godavari), మంజీర, ప్రాణహిత నదులకు భారీగా వరద వస్తోంది. ఆయా నదులపై గల ప్రాజెక్టుల గేట్లు ఎత్తి అధికారులు దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో ఏపీలోని ప్రకాశం, ధవళేశ్వరం బ్యారేజీల నుంచి లక్షల క్యూసెక్కుల నీరు సముద్రంలో కలుస్తోంది.