అక్షరటుడే, వెబ్డెస్క్ : Weather Updates | రాష్ట్రవ్యాప్తంగా గత నాలుగైదు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రైతులు (Farmers) హర్షం వ్యక్తం చేస్తున్నారు. చెరువులు, చిన్న తరహా ప్రాజెక్ట్లలోకి నీరు చేరుతుండటంతో త్వరలోనే నిండే అవకాశం ఉంది. వాగులు పారుతుండటంతో భూగర్భ జలాలు (Ground Water) సైతం పెరిగాయి. దీంతో వానాకాలం పంటలకు ఢోఖా లేదని అన్నదాతలు పేర్కొంటున్నారు. శనివారం కూడా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు (Rains) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ (Meteorological Department) అధికారులు తెలిపారు.
Weather Updates | మోస్తరు వాన
రాష్ట్రంలో నాలుగు రోజులుగా భారీ నుంచి అతి భారీ వర్షాలు (Heavy Rains) పడుతున్నాయి. అయితే శనివారం మోస్తరు వర్షాలు పడతాయని అధికారులు తెలిపారు. 40–45 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, సిరిసిల్ల, మంచిర్యాల, పెద్దపల్లి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో మోస్తరు వాన పడుతుందని వివరించారు. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. రోజంతా ఆకాశం మేఘావృతమై చలిగాలులు వీస్తాయి.
Weather Updates | హైదరాబాద్ నగరంలో..
హైదరాబాద్ (Hyderabad) నగరాన్ని వాన వీడటం లేదు. మోస్తరు వాన పడితేనే చివురిటాకుల వణికే మహా నగరంలో నాలుగు రోజులుగా భారీ వర్షాలు పడుతుండటంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. రోడ్లపై నీరు నిలవడంతో ట్రాఫిక్ జామ్ (Traffic Jam) అయి వాహనదారులు గంటల కొద్ది రోడ్లపై చిక్కుకుపోతున్నారు.
నగరంలో శనివారం కూడా వర్షం పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే వరుణుడు కాస్త శాంతిస్తాడని పేర్కొంది. సాయంత్రం వరకు చిరు జల్లులు మాత్రమే కురుస్తాయని అధికారులు తెలిపారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ఉదయం నుంచే వాన పడుతోంది. అయితే శుక్రవారంతో పోలిస్తే వర్షాలు తగ్గుముఖం పడతాయి. నగరంలో వర్షాలు పడుతుండటంతో ట్రాఫిక్ పోలీసులు ప్రజలకు పలు సూచనలు చేశారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని కోరారు. నీరు నిలిచిన రోడ్లపై నెమ్మదిగా వెళ్లలన్నారు.