అక్షరటుడే, వెబ్డెస్క్ : IRCTC | శివ భక్తుల కోసం భారతీయ రైల్వే (Indian Railways) ఒక ప్రత్యేక కానుకను ప్రకటించింది. తక్కువ ధరకే ఏడు జ్యోతిర్లింగాలను దర్శించుకునే భాగ్యం కల్పిస్తోంది. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) భారత్ గౌరవ్ పేరిట ప్రత్యేక ప్యాకేజీ తీసుకురానుంది. కేవలం రూ. 24,100 ధరతో నవంబర్ 18న యోగా సిటీ రిషికేశ్ రైల్వే స్టేషన్ నుంచి ఈ ప్రయాణం ప్రారంభం కానుంది. 12 రోజుల పాటు సాగే ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో పవిత్ర జ్యోతిర్లింగాలను సందర్శించడమే కాకుండా ప్రత్యేక రైలులో కలిగించే సౌకర్యాలతో పారవశ్యం చెందుతారు.
IRCTC | 12 రోజులు.. ఏడు జ్యోతిర్లింగాలు
స్పెషల్ ప్యాకేజీలో భాగంగా ఏడు జ్యోతిర్లింగాలను దర్శించుకోవచ్చు. ఓంకారేశ్వర్, మహాకాలేశ్వర్, నాగేశ్వర్, సోమనాథ్, త్రయంబకేశ్వర్, భీమశంకర్, గృష్ణేశ్వర్, ద్వారకాధీష్, బెట్ ద్వారక వంటి ఇతర ముఖ్య ప్రదేశాలను సందర్శించుకోవచ్చు. ఈ ప్యాకేజీకోసం IRCTC అధికారిక వెబ్‌సైట్, అధీకృత అవుట్‌లెట్‌ల ద్వారా బుక్ చేసుకోవచ్చు.
IRCTC | 33 శాతం తగ్గింపు..
భారత్ గౌరవ్ యోజన (Bharat Gaurav Yojana) కింద 33% వరకు తగ్గింపుతో ఆధ్యాత్మిక పర్యటనను చేయవచ్చు. 2AC అయితే, ఒకరికి రూ. 54,390, స్టాండర్డ్ 3ACలో ఒకరికి రూ. 40,890, స్లీపర్ క్లాస్ అయితే ఒక్కొక్కరికి రూ. 24,100 చొప్పున టికెట్ రేట్ నిర్ణయించారు. భారతదేశంలోని అత్యంత పవిత్రమైన శివాలయాలను సులభంగా. సౌకర్యంగా సందర్శించే అవకాశాన్ని ఈ ప్యాకేజీ అందిస్తుంది. బడ్జెట్ హోటళ్లలో రాత్రి బస కల్పిస్తారు. ప్రయాణికుల కోరిక ప్రకారం ఎకానమీ, స్టాండర్డ్ లేదా కంఫర్ట్ వసతులు కూడా పొందవచ్చు. అయితే, కొంత అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఉదయం టీ, అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం అందిస్తారు. ప్రయాణికులకు ప్రయాణ బీమా సౌకర్యం ఉంటుంది. అయితే, ఆలయాల్లో దర్శన ఖర్చులు, ఇతరత్రా ఏమైనా ఉంటే యాత్రికులే భరించాలి. లాండ్రీ, వైన్లు, మినరల్ వాటర్, ఆహారం, పానీయాలు వంటి వ్యక్తిగత ఖర్చులు ప్యాకేజీలో భాగం కావు.
భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు 767 మంది ప్రయాణికుల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇది నవంబర్ 18న ప్రారంభమై 29న ముగుస్తుంది. మొత్తం 11 రాత్రులు/12 పగళ్లు ఉంటుంది. యోగా సిటీ రిషికేశ్ నుంచి టూర్ ప్రారంభమవుతుంది. హరిద్వార్, లక్నో, కాన్పూర్, ఇతర స్టేషన్లలో బోర్డింగ్ అవకాశం ఉంది. ప్రయాణికులు బోర్డింగ్ సమయంలో గుర్తింపు రుజువు మరియు COVID-19 టీకా సర్టిఫికేట్ తీసుకురావడం తప్పనిసరి.