అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Railway Passengers | ప్రయాణికుల కోసం భారతీయ రైల్వే శాఖ ఓ కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. పండుగ సమయాల్లో రద్దీని తగ్గించడానికి ‘రౌండ్ ట్రిప్ ప్యాకేజీ (Round Trip Package) పేరుతో పథకాన్ని ప్రవేశపెట్టింది. ఒకేసారి అప్ అండ్ డౌన్ టికెట్ల బుకింగ్ చేసుకునే ప్రయాణికులకు రిటర్న్ జర్నీ (Return Journey) టికెట్ ధరపై 20 శాతం రాయితీ ఇవ్వనుంది. ‘రౌండ్ ట్రిప్ ప్యాకేజీ’లో టికెట్ బుక్ చేసుకునే ప్రయాణికులకు రిటర్న్ టికెట్లపై 20 శాతం డిస్కౌంట్ లభిస్తుందని రైల్వే శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. పండుగ సీజన్లో ముందస్తు రిజర్వేషన్‌ను ప్రోత్సహించడంతో పాటు రద్దీని నియంత్రించడానికి ఈ కొత్త పథకం సహాయపడనుంది. ఈ పథకం ప్రయాణికులపై టికెట్ల భారాన్ని తగ్గిస్తుందని.. సజావుగా ప్రయాణించేందుకు ఉపయోగపడుతుందని రైల్వే శాఖ పేర్కొంది. పండగ సమయంలో టికెట్ల డిమాండ్ పెరిగే నేపథ్యంలో ముందు జాగ్రత్తగా రిజర్వేషన్ చేసుకునేలా ప్రయాణికులను ప్రోత్సహించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
Railway Passengers | 14 నుంచి ప్రారంభం
ఆగస్టు 14 నుంచి ‘రౌండ్ ట్రిప్ ప్యాకేజీ’ అమలులోకి రానుంది. ఈ ఆఫర్‌కు 60 రోజుల ముందస్తు రిజర్వేషన్ నియమం వర్తించదు. ఇది ప్రయాణికులకు అదనపు సౌలభ్యం. 14వ తేదీ నుంచి రోజు నుంచి ప్రయాణికులు తమ అప్ అండ్ జర్నీ కోసం టికెట్లు బుకింగ్ చేసుకోవచ్చు. అక్టోబర్ 13 నుంచి 26 మధ్య ప్రయాణం కోసమే టికెట్ బుక్ చేసుకోవాలి. అలాగే నవంబర్ 17 నుంచి డిసెంబర్ 1 మధ్య తిరుగు ప్రయాణం కోసం రిటర్న్ టికెట్లు బుకింగ్ చేయాలి.
Railway Passengers | షరతులు వర్తిస్తాయి
రైల్వే శాఖ (Railway Department) తీసుకొచ్చిన ఈ కొత్త పథకానికి కొన్ని పరిమితులున్నాయి. ప్రధానంగా రౌండ్ ట్రిప్ చేసుకున్న వారికి మాత్రమే సబ్సిడీ వర్తిస్తుంది. టికెట్ బుకింగ్ (Ticket Booking) సమయంలో రిటర్న్ జర్నీ టికెట్ కూడా బుకింగ్ చేసుకుంటేనే 20 శాతం ఆఫర్ వర్తిస్తుంది. అది కూడా ఒకే తరగతికి చెందిన టికెట్లు అయితేనే పథకానికి అర్హులవుతారు. వెళ్లేటప్పుడు సెకండ్ క్లాస్‌లో, వచ్చేటప్పుడు ఏసీలో బుకింగ్ చేసుకునే వారికి ఈ పథకం వర్తించదు. ప్రయాణికుడు రైల్లో ఊరికి వెళ్లే టికెట్తో పాటు తిరుగు ప్రయాణం కోసమూ టికెట్ను ఒకేసారి బుక్ చేసినప్పుడే ఈ రాయితీ లభిస్తుంది. టికెట్ బుకింగ్ సమయంలో ఇచ్చే ప్రయాణ వివరాల ఆధారంగా డిస్కౌంట్ వర్తించనుంది. ఇరువైపులా టికెట్లు కన్ఫర్మ్ అయ్యే పరిస్థితుల్లో మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఆగస్టు 8న రైల్వే శాఖ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం… ఈ పథకం ఒకే రకమైన ప్రయాణికులు, తరగతి, ప్రారంభ-గమ్యస్థానం నుంచి ప్రయాణంతో పాటు తిరుగు ప్రయాణానికి సంబంధించి టిక్కెట్ల బుకింగ్ చేసుకుంటే వర్తిస్తుంది. ఆన్లైన్లో లేదా రిజర్వేషన్ కౌంటర్లలో చేసిన బుకింగ్లకు ఆఫర్ చెల్లుతుంది. ఈ పథకం కింద టిక్కెట్లకు వాపసు, మార్పులు లేదా ఇతర రాయితీలు అనుమతించబడవు.
Railway Passengers | ఎలా పొందాలంటే..
పథకం కింద, ఒకే రకమైన ప్రయాణికులకు అప్ అండ్ డౌన్ ప్రయాణానికి బుక్ చేసుకున్నప్పుడే రాయితీలు వర్తిస్తాయి. తిరుగు ప్రయాణ ప్రయాణానికి సంబంధించిన ప్రయాణీకుల వివరాలు తదుపరి ప్రయాణానికి సమానంగా ఉంటాయి. రిటర్న్ జర్నీకి సంబంధించిన బేస్ చార్జీపై మాత్రమే 20 శాతం రాయితీ వర్తిస్తుంది.