అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Railway Track | కామారెడ్డి (Kamareddy) జిల్లాలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. మంగళవారం అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చెరువులు అలుగు పారుతున్నాయి. వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పాలు చోట్ల రాకపోకలు నిలిచిపోయాయి.
వర్షాల ధాటికి రైల్వే ట్రాక్ (Railway Track ) కొట్టుకుపోయింది. కామారెడ్డి పట్టణంలో ట్రాక్ కొట్టుకుపోవడంతో పలు రైళ్లు నిలిచిపోయాయి. మేడ్చల్ – నిజామాబాద్ మధ్య కొన్ని రైళ్లు ఆయా స్టేషన్లలో నిలిచిపోయాయి. విశాఖపట్నం – నాందేడ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ అక్కన్నపేట్ జంక్షన్ దగ్గర గత రెండున్నర గంటల నుండి అక్కడే ఉంది. కాచిగూడ – మెదక్ ప్యాసింజర్ మీర్జాపల్లి వద్ద గంటన్నర నుంచి ఆగిపోయింది.
నాందేడ్ – మేడ్చల్ ప్యాసింజర్ కామారెడ్డి వద్ద రెండు గంటల నుంచి నిలిచిపోయింది. ముంబై – లింగంపల్లి దేవగిరి ఎక్స్‌ప్రెస్ నిజామాబాద్ వద్ద గంట 45 నుంచి ఉంది. భగత్ కి కోఠి – కాచిగూడ ఎక్స్‌ప్రెస్ నవీపేట్ వద్ద గంట సేపటి నుంచి నిలిచిపోయింది. కాచిగూడ – కరీంనగర్ DEMU ప్యాసింజర్ తిప్పాపూర్‌లో 3 గంటలుగా ఉండిపోయింది. కామారెడ్డి మీదుగా నడిచే రైళ్లను అధికారులు రద్దు చేశారు. ఆయా స్టేషన్లలో రైళ్లు ఆగిపోవడంతో ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. వరద ఉధృతి కొనసాగుతుండటంతో ట్రాక్ మరమ్మతులు ఇప్పట్లో చేపట్టే అవకాశం లేదు.