అక్షరటుడే, వెబ్డెస్క్ : Railway Passengers | రైల్వే శాఖ (Railway Department) ప్రయాణికులకు కీలక వార్త చెప్పింది. రైల్వే ఛార్జీలను స్వల్పంగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెరిగిన రేట్లు ఈ నెల 26 నుంచి అమలులోకి రానున్నాయి.
భారతీయ రైల్వే (Indian Railways) శాఖ టికెట్ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంతో రైల్వేకు ఏటా అదనంగా రూ.600 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. కొత్త టికెట్ ధరల (new ticket prices) నిర్మాణం ప్రకారం, ప్రయాణికులు ఆర్డినరీ క్లాస్లో 215 కి.మీ.కు మించి ప్రయాణిస్తే కి.మీ.కు 1 పైసా అదనంగా వసూలు చేస్తారు. మెయిల్/ఎక్స్ప్రెస్ నాన్-ఏసీ, ఏసీ తరగతులకు కి.మీ.కు 2 పైసలు పెంచింది. 215 కి.మీ కంటే తక్కువ మార్గాల్లో ప్రయాణించే ప్రయాణికులకు టికెట్ ధరలలో ఎటువంటి పెరుగుదల లేదు. 500 కి.మీ నాన్-ఏసీలో ప్రయాణం చేసే వారిపై అదనంగా రూ.10 భారం పడనుంది. పేద, మధ్యతరగతి ఆదాయ కుటుంబాలకు సరసమైన ధరలను కొనసాగించడానికి, రైల్వే సబర్బన్, నెలవారీ సీజన్ టిక్కెట్ల ఛార్జీలను పెంచలేదు.
Railway Passengers | ప్రత్యేక రైళ్లు
క్రిస్మస్, నూతన సంవత్సర (Christmas and New Year) కాలంలో ఎనిమిది జోన్లలో 244 ట్రిప్పులతో ప్రత్యేక రైళ్లను నడపాలని భారత రైల్వే ప్రణాళిక వేసింది. ప్రయాణికుల రద్దీ మేరకు సర్వీసులు నడుపుతామని ప్రకటించింది. ఢిల్లీ, హౌరా, లక్నో సమీప నగరాలను అనుసంధానించే రద్దీ కారిడార్లలో ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. టూరిస్ట్ స్పాట్లకు రైళ్ల సర్వీస్లను పెంచినట్లు అధికారులు తెలిపారు.