అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: Railway Gate | నగర శివారులోని మాధవనగర్ వద్ద రైల్వేగేట్ (Madhavnagar) మొరాయించింది. ఈ ఘటన శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. రైల్వే గేట్ (Railway gate) వద్ద ఎప్పటిలాగే ఉదయం రైల్వేస్టేషన్ నుంచి రైలు వెళ్లే సమయంలో గేట్మన్ గేట్ వేశాడు. అయితే బైపాస్ వైపు గేట్ పూర్తిగా పడకపోవడంతో కొద్దిసేపు గందరగోళం ఏర్పడింది. చివరకు పూర్తిగా గేట్ పడకపోయినప్పటికీ రైళ్ల రాకపోకలు కొనసాగాయి. రైలు వెళ్లిన అనంతరం వాహనదారులు సైతం కొద్దిగా తెరిచి ఉంచిన గేట్ గుండానే రాకపోకలు సాగించారు. అనంతరం రైల్వేసిబ్బంది మరమ్మతులు చేశారు.
Railway Gate | ట్రాఫిక్కు ఇబ్బందులు
మాధవనగర్ బైపాస్ వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి (Railway overbridge) పనులు కొన్ని నెలలుగా జరుగుతున్నాయి. అయితే ఈ ప్రాంతంలో తరచూ ట్రాఫిక్కు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. సరైన ట్రాఫిక్ డైవర్షన్ లేకపోవడంతో వాహనాలు అస్తవ్యస్తంగా వస్తూ వెళ్తున్నాయి. దీనికి తోడు రైల్వేగేట్ కూడా అప్పుడప్పుడు మొరాయిస్తుండడంతో వాహనదారులు తిప్పలు అన్నీఇన్నీ కావు. వాహనాలు వచ్చీవెళ్లేందుకు సరైన రోడ్లు కూడా లేకపోవడం ఇబ్బందిగా మారింది.
Railway Gate | రాత్రయితే చీకట్లు..
రైల్వే ఓవర్ బ్రిడ్జి వంతెన పనులు జరుగుతున్న ఈ రహదారిపై రాత్రయితే చాలు చిమ్మచీకట్లు ఏర్పడుతున్నాయి. వర్షాకాలంలో గుంతలు ఎక్కడ ఉన్నాయో.. రోడ్డు ఎక్కడ ఉందో తెలియని పరిస్థితి నెలకొంది. వంతెన నిర్మిస్తున్న ప్రాంతంలో గతంలో తారురోడ్డు వేసినప్పటికీ అక్కడే తిరిగే భారీ యంత్రాల కారణంగా రోడ్డంతా దెబ్బతిన్నది.