అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Constable Suspended | మహిళలను రక్షించాల్సిన ఓ కానిస్టేబుల్ యువతితో అసభ్యంగా ప్రవర్తించాడు. రైలులో రక్షణగా ఉండాల్సిన ఆయన అర్ధరాత్రి అమ్మాయిని తాకాడు. దీంతో ఆ యువతి సదరు కానిస్టేబుల్ పట్టుకొని నిలదీయగా క్షమించాలని వేడుకున్నాడు. అయితే ఈ విషయం ఉన్నతాధికారులకు చేరడంతో సదరు కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేశారు.
ఢిల్లీ నుంచి ప్రయాగ్‌రాజ్ (Delhi -Prayagraj) వెళ్తున్న ట్రెయిన్‌లో ఓ యువతి ప్రయాణిస్తోంది. రాత్రి కావడంతో లైట్లు ఆఫ్ చేసి అందరు పడుకున్నారు. దీంతో జీఆర్‌పీ కానిస్టేబుల్ (GRP Constable) ఆశిష్ గుప్తా ఓ యువతిని అసభ్యంగా తాకాడు. చీకట్లో తనున ఎవరూ గుర్తించరన్న ఉద్దేశంతో ఈ నీచపు పనికి పాల్పడ్డాడు. అయితే యువతి నిద్రలేచి పట్టుకోవడంతో కానిస్టేబుల్ క్షమించాలంటూ వేడుకున్నాడు. మహిళలను రక్షించాల్సిన పోలీసులే ఇలాంటి నీచపు పని చేస్తే ఎలా అంటూ యువతి మండిపడింది.
Constable Suspended | సోషల్ మీడియాలో వైరల్
యువతి కానిస్టేబుల్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన వీడియో సోషల్ మీడియా (Social Media)లో వైరల్‌గా మారింది. ఈ విషయం ఉన్నతాధికారులకు చేరడంతో చర్యలు చేపట్టారు. రైలులో ప్రయాణికురాలిని వేధించినందుకు GRP కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేసినట్లు శనివారం అధికారులు తెలిపారు. కానిస్టేబుల్ ఆశిష్ గుప్తా యువతితో అసభ్యంగా ప్రవర్తించినట్లు వీడియో వైరల్ కావడంతో చర్యలు చేపట్టామన్నారు. అయితే ఈ ఘటనపై సదరు యువతి ఇప్పటివరకు అధికారికంగా ఫిర్యాదు చేయలేదని పేర్కొన్నారు.
Constable Suspended | అధికారులే ఇలా చేస్తే ఎలా..
ప్రజలకు అండగా ఉండాల్సిన అధికారులే దారి తప్పుతున్నారు. రైలులో మహిళలకు రక్షణగా నిలవాల్సిన కానిస్టేబుల్ చీకట్లో యువతిని అసభ్యంగా తాకడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇటీవల పలువురు అధికారులు సైతం న్యాయం కోసం తమ దగ్గరకు వస్తున్న మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.