అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Rahul Gandhi | కేంద్ర ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ గురువారం మరోసారి తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. అనేక రాష్ట్రాల ఓటర్ల జాబితాలో ఎన్నో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. కేంద్ర ఎన్నికల సంఘం (Central Election Commission) బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని, దేశంలో ఎన్నికలు ప్రస్తుతం నృత్యరూపకం (కొరియోగ్రఫీ) చేయబడుతున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో వస్తున్న ఎన్నికల ఫలితాలు అంచనాలను మించి ఉంటున్నాయని అనుమానం వ్యక్తం చేశారు. హర్యానా, మధ్యప్రదేశ్‌లోనూ.. ఇదే విధంగా ఫలితాలు వచ్చాయని గుర్తు చేశారు. న్యూ ఢిల్లీలోని గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన కొన్ని లెక్కలు చూపుతూ ఈసీపై ఆరోపణలు గుప్పించారు.
Rahul Gandhi | ఈవీఎంల నిర్వహణపై అనుమానాలు..
నేటి కాలంలో ఎన్నికలు (Elections) నృత్యరూపకం చేయబడుతున్నాయని, మహారాష్ట్ర ఎన్నికలు దొంగిలించబడ్డాయని రాహుల్ విమర్శించారు. ఈవీఎం(EVM)లతో ఎన్నికల నిర్వహణ అనుమానాలకు తావిస్తోందని కీలక వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపైనా అనుమానాలున్నాయని, ఎగ్జిట్ పోల్స్ (Exit polls), ఒపీనియన్ పోల్స్‌కు (Opinion polls) వ్యతిరేకంగా ఫలితాలు వచ్చాయని గుర్తు చేశారు. “ఈ అభిప్రాయ సేకరణల నుంచి అకస్మాత్తుగా ఫలితాల మార్పునకు, ప్రభుత్వ వ్యతిరేకత లేకపోవడానికి ఎల్లప్పుడూ ఒక కారణం ఉంటుంది. కారణాలు అనేకంగా ఉంటాయి- లాడ్లీ బెహ్నా, పుల్వామా, ఇప్పుడు సిందూర్ (ఆపరేషన్ సిందూర్),” అని ఆయన వ్యాఖ్యానించారు. ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలపై పరిశోధన చేయగా, తమ అనుమానాలు నిజమయ్యాయని తెలిపారు.
Rahul Gandhi | నెలల తరబడి ఎన్నికలు..
గతంలో దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరిగేవని, కానీ ఇప్పుడు నెలల తరబడి నిర్వహిస్తున్నారని రాహుల్ ఆక్షేపించారు. “దేశంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు లేని కాలం ఉండేది; అది వ్యక్తిగత ఓటింగ్. దేశం మొత్తం ఒకే రోజున ఓటు వేసేది. కానీ ప్రస్తుతం యూపీలో వేర్వేరు రోజుల్లో ఓటింగ్ పెడుతున్నారు. కొన్నిసార్లు బీహార్‌లో కూడా. కొన్నిసార్లు నెలల తరబడి పోలింగ్‌కు సమయం తీసుకున్నారు. దీనిపై మాకు మొదటి నుంచి అనుమానాలున్నాయి. ఎందుకు ఇంత సమయం పడుతోందని?” అని రాహుల్ గాంధీ (Rahul Gandhi) అన్నారు.
Rahul Gandhi | ఐదు నెలల్లో కోటి మంది ఓటర్లు..
ఓటరు చోరీ గురించి రాహుల్ మరోసారి ఆరోపణలు చేశారు. “మహారాష్ట్రలో (Maharashtra) 5 సంవత్సరాలలో కంటే 5 నెలల్లోనే ఎక్కువ మంది ఓటర్లు చేరడం మాకు అనుమానాలను రేకెత్తించింది. అలాగే, సాయంత్రం 5 గంటల తర్వాత ఓటర్ల ఓటింగ్లో భారీ పెరుగుదల కనిపించింది. ఫలితంగా ఎన్నికల్లో మా కూటమి తుడిచిపెట్టుకుపోయింది. ఇది చాలా అనుమానాస్పదంగా ఉందని” పేర్కొన్నారు. “లోక్‌సభ, విధానసభ మధ్య ఎన్నికల వ్యవధిలో కోటి మంది కొత్త ఓటర్లు చేరినట్లు మేము గుర్తించాం. మేము ఎన్నికల కమిషన్‌కు (Election Commisssion) వెళ్లి దీనిపై ఫిర్యాదు చేశాం. కానీ వాళ్లు మాకు ఎలాంటి వివరాలు ఇవ్వలేదు. ఓటర్ల జాబితా ఇవ్వమని కోరినా పట్టించుకోలేదని” అని తెలిపారు. అంతేకాదు, ఓటరు జాబితాను ఇవ్వడానికి నిరాకరించిన ఈసీ.. ఆపై వారు చాలా ఆసక్తికరమైన పని చేశారని, CCTV ఫుటేజ్‌ను నాశనం చేయబోతున్నామని చెప్పారన్నారు. ఇది మరింత ఆశ్చర్యం కలిగించిందని, ఎందుకంటే మహారాష్ట్రలో సాయంత్రం 5.30 తర్వాత భారీగా పెరిగిన ఓటింగ్ పై అనేక అనుమానాలున్నాయి. వాస్తవానికి 5.30 తర్వాత భారీ ఓటింగ్ జరగలేదు. ఈ రెండు విషయాలు భారత ఎన్నికల కమిషన్ ఎన్నికలను దొంగిలించడానికి బీజేపీతో కుమ్మక్కవుతుందన్న వాదనకు బలం చేకూర్చుతోందని ఆరోపించారు.