అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Election Commission | ఎన్నికల ప్రక్రియపై కాంగ్రెస్ నేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ చేసిన ఆరోపణలను కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం తోసిపుచ్చింది. ప్రజలను తప్పుదోవ పట్టించేలా వ్యవహరించిన ఆయన దేశానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. ఇండియా బ్లాక్ సమావేశంలో రాహుల్‌గాంధీ(Rahul Gandhi) చేసిన ప్రజెంటేషన్‌ను కొట్టిపడేసిన ఈసీ.. దీనిని “అసంబద్ధ విశ్లేషణ” అని పేర్కొంది. “తప్పుదారి పట్టించే వివరణలను” వ్యాప్తి చేసినందుకు డిక్లరేషన్ చేస్తూ ఫిర్యాదు చేయాలని, లేదా “దేశానికి క్షమాపణ చెప్పాలని” కూడా పోల్ కమిషన్ సూచించింది.
Election Commission | డిక్లరేషన్ ఇస్తారా.. క్షమాపణలు చెబుతారా..
ఎన్నికల సంఘం(Election Commission)పై తాను చేసిన ఆరోపణలు నిజమని రాహుల్‌గాంధీ భావిస్తే, ఆ మేరకు డిక్లరేషన్‌పై సంతకం చేసి ఫిర్యాదు చేయాలని ఈసీ సూచించింది. అలా చేయకపోతే ఆయన చెప్పినవన్ని అబద్ధాలేనని భావించాల్సి వస్తుందని పేర్కొంది. ప్రజలను తప్పుదోవ పట్టించేలా అసంబద్ధ ఆరోపణలు చేసేందుకు ఆయన దేశానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. “రాహుల్ గాంధీ తన విశ్లేషణను విశ్వసిస్తే, భారత ఎన్నికల సంఘంపై తన ఆరోపణలు నిజమని విశ్వసిస్తే.. డిక్లరేషన్(Declaration) పై సంతకం చేయడానికి ఎందుకు సమస్య. ఆయన డిక్లరేషన్ పై సంతకం చేయకపోతే, తన విశ్లేషణ, దాని ఫలితంగా వచ్చిన తీర్మానాలు, అసంబద్ధ ఆరోపణలను కూడా ఆయనే నమ్మడం లేదని అర్థం. అందుకు గాను ఆయన దేశానికి క్షమాపణ చెప్పాలని” అని ఈసీ వర్గాలు పేర్కొన్నాయి.
Election Commission | ఈసీపై ఆరోపణలు.. ఖండించిన బీజేపీ..
మొదటి నుంచి ఎన్నికల సంఘంపై ఆరోపణలు చేస్తున్న రాహుల్‌గాంధీ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. ఎన్నికల సంఘం బీజేపీ(BJP)తో కలిసి ఓట్ల చోరీకి కుట్ర పన్నిందని పేర్కొన్నారు. ఈ మేరకు ఓటర్ జాబితాల్లో అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపించారు. 2024 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా కర్ణాటక అసెంబ్లీ(Karnataka Assembly) విభాగంలో భారీ ఓటర్ల మోసం బయటపడిందని పేర్కొన్నారు. కర్ణాటకలో జరిగిన ఒక సర్వేలో ఆరు ప్రధాన అక్రమాలు జరిగినట్లు ఆయన ఆరోపించారు. ఎన్నికల సంఘం బీజేపీతో కుమ్మక్కై అసెంబ్లీ ఎన్నికల కోసం “కొరియోగ్రాఫ్ చేసిన షెడ్యూల్”ను రూపొందించిందని, డిజిటల్ ఓటరు జాబితాలను అందించడానికి కూడా నిరాకరించిందని ఆరోపించారు. అయితే, రాహుల్ ఆరోపణలను ఈసీతో పాటు బీజేపీ కూడా తోసిపుచ్చింది. కర్ణాటకలో ఓటరు జాబితాపై ఆరోపణలు చేస్తున్న రాహుల్‌గాంధీ.. ఆ మేరకు డిక్లరేషన్‌ను సమర్పించడానికి ఎందుకు వెనకడుగు వేస్తున్నారని ప్రశ్నంచింది. రాజ్యాంగబద్ధ సంస్థ అయిన ఎన్నికల సంఘం ప్రతిష్టను దెబ్బ తీసేందుకు రాహుల్ ప్రయత్నిస్తున్నారని బీజేపీ మీడియా సెల్ చీఫ్ అమిత్ మాలవీయ(Amit Malviya) అన్నారు.