అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Independence Day | ఢిల్లీలోని ఎర్రకోటలో శుక్రవారం నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు కాంగ్రెస్ అగ్ర నేతలు హాజరు కాలేదు. ఎర్రకోటలో నిర్వహించే వేడుకలకు పాలక, ప్రతిపక్షాల నేతలు హాజరు కావడం ఆనవాయితీగా వస్తోంది. అయితే, ఈసారి మాత్రం ప్రతిపక్ష కాంగ్రెస్ ఆ సంప్రదాయాన్ని విస్మరించింది. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ(Rahul Gandhi) గైర్హాజరయ్యారు. ఇదే అంశం ప్రస్తుతం జాతీయ మీడియాలో చర్చనీయాంశమైంది. వారు ఎందుకు హాజరు కాలేదనే దానిపై జోరుగా ఊహాగానాలు వచ్చాయి. దీనిపై కాంగ్రెస్ వైపు నుంచి ఎటువంటి ప్రకటన వెలువడలేదు. అయితే, గత సంవత్సరం సీట్ల ఏర్పాటుతో అసంతృప్తి చెందిన గాంధీ ఈ కార్యక్రమానికి హాజరు కాలేదని తెలిసింది. మరోవైపు, వేడుకలకు దూరంగా ఉండడంపై అధికార బీజేపీ తీవ్ర స్థాయిలో విమర్శలు ఎక్కుపెట్టింది.
Independence Day | సోషల్ మీడియాలోనే నివాళి..
ఎర్రకోటలో స్వాతంత్య్ర దినోత్సవాలకు దూరంగా ఉన్న రాహుల్‌గాంధీ, ఖర్గే (Kharge) సోషల్ మీడియాలోనే సమరయోధులకు నివాళులర్పించారు. కాంగ్రెస్ పార్టీ ఆఫీస్‌లో జరిగిన వేడుకకు ఖర్గే, ఇందిరా భవన్(Indira Bhavan)లో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవాలకు రాహుల్ హాజరయ్యారు. గొప్ప స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాల ద్వారా సాధించి ఈ స్వేచ్ఛ, సమానత్వాన్ని, వారి వారసత్వాన్ని కాపాడుకోవడం మనందరి కర్తవ్యమని రాహుల్ ఎక్స్‌లో పేర్కొన్నారు.
Independence Day | తప్పుబట్టిన బీజేపీ..
ఎర్రకోట(Red Fort)లో జరిగిన వేడుకలకు కాంగ్రెస్ దూరంగా ఉండిపోవడంపై బీజేపీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. పాకిస్తాన్ ప్రేమికుడు జాతీయ వేడుకకు ఎందుకు హాజరవుతాడని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనవాలా(Shehzad Poonawalla) విమర్శించారు. రాహుల్ తీరు సిగ్గుచేటని ధ్వజమెత్తారు.
Independence Day | గతేడాది ప్రొటోకాల్ వివాదం..
నిరుడు స్వాతంత్య్ర దినోత్సవాల(Independence Day) సందర్భంగా ప్రొటోకాల్ వివాదం తలెత్తింది. ప్రతిపక్ష నాయకుడిగా కేబినెట్ హోదా కలిగిన రాహుల్‌గాంధీకి ప్రొటోకాల్‌కు భిన్నంగా రెండో వరుసలో సీటు కేటాయించడంతో వివాదం చెలరేగింది. కేబినెట్ మంత్రి హోదా కలిగిన ప్రతిపక్ష నేతకు ఇలా చేయడం ప్రజలను అవమానించడమేనని కాంగ్రెస్ ఆరోపించగా, బీజేపీ(BJP) తిప్పికొట్టింది. ఒలింపిక్స్ విజేతలకు ముందు వరుసలో సీట్లు కేటాయించడం వల్లే ఇలా జరిగిందని కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. గతానుభవాల నేపథ్యంలోనే కాంగ్రెస్ ఈసారి వేడుకలకు దూరంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.