అక్షరటుడే, వెబ్డెస్క్: Rahul Gandhi | బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో (Bihar Assembly elections) కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలైంది. 61 చోట్ల పోటీ చేస్తే ఆరుస్థానాల్లో మాత్రమే గెలుపొందింది.
ఈ నేపథ్యంలో పార్టీ అగ్రనేత, భావి ప్రధానిగా చెప్పుకునే రాహుల్ గాంధీ (Rahul Gandhi) నాయకత్వంపై సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ.. అనేక ఎన్నికల్లో ఓటమి మూటగట్టుకుంది. రాహుల్ గాంధీ పార్టీలో కీలకంగా మారిన తర్వాత గత రెండు దశాబ్దాల కాలంలో జరిగిన అనేక ఎన్నికల్లో ఘోరంగా విఫలమైంది. ఈ నేపథ్యంలోనే ఆయన నాయకత్వ పటిమ, వ్యవహార శైలిపై సందేహాలు కలుగుతున్నాయి.
Rahul Gandhi | వారసత్వంగా వచ్చి..
గాంధీ కుటుంబ వారసుడిగా రాజకీయాల్లోకి అడుగిడిన రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి (Congress party) విజయాలు సాధించి పెట్టడంలో విఫలమయ్యారు. 2004లో జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో రాహుల్ క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆయన నేతృత్వంలో హస్తం పార్టీ విజయాలు సాధించలేదు సరికదా అనేక ఎన్నికల్లో ఓటమి పాలైంది.
రెండు దశాబ్దాల కాలంలో పార్లమెంట్ తో పాటు అనేక రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగిన ఎలక్షన్లలో కాంగ్రెస్ బాధ్యతలను రాహుల్ గాంధీ మోశారు. కానీ, పార్టీని విజయతీరాలకు చేర్చడంలో ఆయన వైఫల్యం చెందారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ నేతృత్వంలో ఎన్నికలకు వెళ్లిన గ్రాండ్ ఓల్డ్ పార్టీకి చుక్కెదురైంది. అలాగే, పలు రాష్ట్రాల్లోనూ అదే ఫలితం రావడంతో రాహుల్ పార్టీ పగ్గాలను వదులుకున్నారు.
Rahul Gandhi | విఫల నేతగా..
సుదీర్ఘ చరిత్ర కలిగిన పార్టీని ముందుకు నడిపించడంలో రాహుల్ పూర్తిగా విఫలమయ్యారు. వరుస ఓటములతో సతమతమవుతున్న కాంగ్రెస్ ను తిరిగి బలోపేతం చేయడంలో వైఫల్యం చెందారు. కాంగ్రెస్ లో తనకంటూ ప్రత్యేక కోటరీ ఏర్పాటు చేసుకున్న అతడు.. మిగతా సీనియర్లను, దశాబ్దాలుగా పార్టీకి సేవ చేస్తున్న వారిని పట్టించుకోలేదు. ఫలితంగా గులాం నబీ ఆజాద్ (Ghulam Nabi Azad) లాంటి ముఖ్య నేతలు హస్తం పార్టీని వీడారు. రాహుల్ నాయకత్వ వైఫల్యాలతో కాంగ్రెస్ పార్టీ రోజురోజుకు ప్రాభవం కోల్పోయింది. దేశంలోని అనేక ప్రాంతాల్లో ఉనికే లేకుండా పోయింది. చాలా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలకు (regional parties) తోక పార్టీగా మారిపోయింది.
Rahul Gandhi | సత్తా చాటని రాహుల్..
2014లో మోదీ శకం ప్రారంభమైన తర్వాత రాహుల్ ప్రభ మరింత మసక బారింది. మోదీ-షా (Modi-Shah) ద్వయం ఎత్తుగడలతో అన్ని ఎన్నికల్లో చిత్తుకావడం కాంగ్రెస్ వంతుగా మారుతోంది. 2014, 2019లలో జరిగిన సార్వత్రిక పోరులో బీజేపీ సొంతంగా మెజార్టీ స్థానాలు దక్కించుకుంది. అలాగే అత్యధిక రాష్ట్రాల్లో అధికారం చేజిక్కించుకుంది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ కనీస పోటీ ఇవ్వలేక చేతులెత్తేసింది.
2019లో అయితే, కేవలం 40 సీట్లలో మాత్రమే గెలుపొందిన హస్తం పార్టీ కనీసం ప్రతిపక్ష హోదా కూడా సాధించలేక పోయింది. 2024 లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో (parliamentary elections) గెలుపొందేందుకు రాహుల్ అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. దశాబ్ద కాలం పాటు అధికారంలో కొనసాగిన ఎన్డీయేను గద్దె దింపడంలో ఆయన విఫలమయ్యారు. భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra) పేరిట దేశమంతా తిరిగినా ఓటర్లు కరుణ చూపలేదు. మూడోసారి ఎన్డీయేకే అధికారం అప్పగించారు.
Rahul Gandhi | పని చేయని ‘ఓటు చోరీ’..
బీజేపీని ఎదుర్కోవడంలో విఫలమైన రాహుల్ గాంధీ కొంత కాలంగా సంచలన ఆరోపణలతో పతాక శీర్షికల్లోకి ఎక్కుతున్నారు. బీజేపీ, ఎన్నికల సంఘం (Election Commission) కలిసి ఓట్ల చోరీకి పాల్పడుతున్నాయని రాహుల్ గాంధీ పలుమార్లు ఆరోపించారు. మీడియా సమావేశాల్లో ఎన్నికల సంఘంపై నేరుగానే తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అంతకు ముందు ఈవీఎంల ట్యాంపరింగ్ అంటూ ఆరోపణలు గుప్పించారు. అయితే, ఆయన ఆరోపణల్లో పస లేకపోవడంతో జనం లైట్ తీసుకున్నారు.
Rahul Gandhi | బీజేపీకి మేలు చేసేలా..
రాహుల్ గాంధీ వ్యవహార శైలి బీజేపీకి బాగా కలిసొస్తోంది. సరైన నాయకత్వ పటిమ లేని ఆయనతో మోదీ-షా ద్వయం ఆడుకుంటోంది. రాహుల్ గాంధీ ఉన్నంత కాలం బీజేపీని ఆపడం ఎవరి తరం కాదని ప్రత్యర్థి పార్టీలే కాదు సొంత పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారంటే ఆయన వ్యవహార శైలి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా బీహార్ ఎన్నికలో ఓటమి తర్వాత బీజేపీ నేతలు రాహుల్ గాంధీపై తీవ్ర స్థాయిలో సెటైర్లు వేశారు. ఆయన నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ 95 సార్లు ఓడిపోయిందని ఎద్దేవా చేశారు. ఎన్నికల ఓటముల్లో స్థిరత్వానికి అవార్డులు ఉంటే అవన్నీ రాహుల్ గాంధీకే వచ్చేవని బీజేపీ నేత అమిత్ మాలవీయ (BJP leader Amit Malviya) పేర్కొన్నారు. రాహుల్ గాంధీ పరాజయాలను చూసి ఓటమి కూడా ఆశ్చర్యపోక తప్పదని వ్యంగ్యంగా అన్నారు.
