అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Ragging | ర్యాగింగ్ భూతం మళ్లీ జడలు విప్పుతోంది. కొన్నేళ్లుగా ర్యాగింగ్ అంతగా లేదు. అయితే ఇటీవల మళ్లీ సీనియర్లు జూనియర్లను ర్యాగింగ్ పేరిట వేధించడం మొదలు పెట్టారు. తాజాగా జగిత్యాల జిల్లాలోని జేఎన్టీయూలో (JNTU in Jagtial district) ర్యాగింగ్ కలకలం రేపింది.
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నాచుపల్లిలో జేఎన్టీయూ కాలేజీ (JNTU college) ఉంది. ఇంట్రాక్షన్ పేరుతో సీనియర్లు జూనియర్లు ర్యాగింగ్ చేశారు. బీటెక్ సెకండియర్ విద్యార్థులు (BTech second-year students) కొత్తగా చేరిన వారిని మానసికంగా వేధించారు. వారి వేధింపులతో భయపడిన పలువురు విద్యార్థులు తరగతులకు హాజరు కాలేదు.
Ragging | పట్టించుకోని అధికారులు
ఈ ఘటనపై జూనియర్లు కాలేజీ ప్రొఫెసర్లకు, అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా కానీ పట్టించుకోలేదని వారు ఆరోపించారు. కాలేజీ యాజమాన్యం (college management) తీరుపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లలు ఇబ్బందులు పడుతుంటే పట్టనట్లు వ్యవహరించడం సరికాదన్నారు. ఈ ఘటనపై విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Ragging | గతంలో తీవ్రంగా..
రాష్ట్రంలోని ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీల్లో ఒకప్పుడు ర్యాగింగ్ ఘోరంగా ఉండేది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలోని (Hyderabad city) పలు కాలేజీల్లో సీనియర్ల వేధింపులతో జూనియర్లు ఆత్మహత్యలు సైతం చేసుకున్న ఘటనలు ఉన్నాయి. 2010కి ముందు ర్యాగింగ్ తీవ్రంగా ఉండేది. దీంతో సీనియర్లు కనిపిస్తే జూనియర్లు భయపడే వారు. అయితే ఆ తర్వాత ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవడం మార్పు వచ్చింది. హైదరాబాద్ నగర కమినర్‌గా ఏకే ఖాన్ పనిచేసిన సమయంలో ఇంజినీరింగ్ కాలేజీలకు వార్నింగ్ ఇచ్చారు. ర్యాగింగ్ జరిగితే కాలేజీలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అన్ని కాలేజీల్లో యాంటి రాగింగ్ కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. దీంతో అప్పటి నుంచి ర్యాగింగ్ అంతగా లేదు.
Ragging | పెరుగుతున్న ఘటనలు
తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల మళ్లీ ర్యాగింగ్ కలకలం రేపుతుంది. నల్లగొండ మెడికల్ కాలేజీలో (Nalgonda Medical College) ఇటీవల ఫస్ట్‌యిర్ వైద్య విద్యార్థులను రెండో ఏడాది చదువుతున్న సీనియర్లు ర్యాగింగ్ చేశారు. దీనిపై ఫిర్యాదు చేసినందుకు మరోసారి ర్యాగింగ్‌కు పాల్పడ్డారు. తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీలో సైతం ఇటీవల ఇలాంటి ఘటన జరిగింది. ర్యాగింగ్‌లో ఒ ప్రొఫెసర్ కూడా పాల్గొన్నాడు. దీంతో అతడిని అధికారులు సస్పెండ్ చేశారు. అయితే ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్, వెబ్ సిరీస్‌ల ప్రభావంతో చాలా మంది యువత చెడు అలవాట్లకు బానిసలుగా మారుతున్నారు. సమాజాన్ని, చట్టాలను లెక్క చేయడం లేదు. ఈ క్రమంలో ర్యాగింగ్ ఘటనలు సైతం పెరుగుతున్నాయి.
