అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Vice President | భారతదేశ 15వ ఉప రాష్ట్రపతిగా చంద్రపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో (Rashtrapati Bhavan) జరిగిన కార్యక్రమంలో చంద్రపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్‌తో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Draupadi Murmu) ప్రమాణ స్వీకారం చేయించారు.
ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi), హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, మాజీ ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి, రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే తదితరులు పాల్గొన్నారు. ఉప రాష్ట్రపతి పదవికి అనూహ్యంగా రాజీనామా చేసిన ధన్‌ఖడ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
Vice President | ఘన విజయం..
అనారోగ్య కారణాలతో జగదీప్ ధన్‌ఖడ్ (Jagdeep Dhankhad) ఉప రాష్ట్రపతి పదవికి రాజీనామా చేయడంతో ఎన్నిక అనివార్యమైంది. మంగళవారం ఇటీవల జరిగిన ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి, తమిళనాడుకు చెందిన రాధాకృష్ణన్‌కు ఘన విజయం సాధించారు. విపక్ష ఇండి కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్‌రెడ్డిపై ఆయన 152 ఓట్ల తేడాతో గెలుపొందిన సంగతి తెలిసిందే.
రాధాకృష్ణన్ కు 452 ఓట్లు రాగా, సుదర్శన్‌రెడ్డికి 300 ఓట్లు వచ్చాయి. ఎన్నికల్లో విజయం సాధించిన రాధాకృష్ణన్(CP Radhakrishnan)తో రాష్ట్రపతి శుక్రవారం ప్రమాణ స్వీకారం చేయించారు. అంతకు ముందు.. రాజ్యసభ సెక్రెటరీ జనరల్, రిటర్నింగ్ అధికారి పీసీ మోదీ మాట్లాడుతూ 781 మంది ఎంపీలలో 767 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని చెప్పారు. 752 బ్యాలెట్లు చెల్లుబాటు అయ్యాయని, 15 చెల్లలేదన్నారు.