అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Question Paper Leakage | ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పరీక్షా పత్రాల లీకేజీ వ్యవహారంపై మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao) స్పందించారు. పరీక్షల నిర్వహణలో ప్రభుత్వ చేతగానితనం, అసమర్థత, అవినీతికి ఈ ఘటన నిదర్శనమన్నారు.
జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం (Jayashankar Agricultural University)లో ఇటీవల పరీక్ష ప్రశ్న పత్రాలు లీక్ అయ్యాయి. ఇటీవల వీసీ జానయ్య జగిత్యాల వ్యవసాయ కాలేజీని తనిఖీ చేశారు. ఆ సమయంలో సెమిస్టర్ ప్రశ్నాపత్రాలు లీక్ అవుతున్నట్లు గుర్తించారు. దీనిపై విచారణ కోసం కమిటీ వేశారు. వ్యవసాయ శాఖలో ఏఈవోలుగా పని చేస్తూ.. యూనివర్సిటీలో ఇన్ సర్వీస్ కోటా కింద బీఎస్సీ థర్డ్ ఇయర్ (BSc Third Year)చదువుతున్న 35 మంది పేపర్ లీకేజీకి కారణమని అధికారులు గుర్తించారు. ఫైనల్ పరీక్షల ప్రశ్న పత్రాలను సిబ్బంది సహకారంతో లీకు చేశారని తేల్చారు. ఇందులో భారీగా డబ్బులు చేతులు మారిందని గుర్తించారు. దీంతో ఆ 35 మందిని యూనివర్సిటీ అధికారులు డిస్మిస్ చేశారు. తిరిగి వ్యవసాయ శాఖకు పంపించారు. అలాగే విశ్వవిద్యాలయంలోని నలుగురు సిబ్బందిని సస్పెండ్ చేశారు.
Question Paper Leakage | సీఎం ఏం చేస్తున్నట్లు?
ప్రశ్న పత్రాల లీకేజీపై శుక్రవారం హరీశ్‌రావు ఎక్స్ వేదికగా స్పందించారు.పీజీ వైద్య విద్య పరీక్షల్లో బయటపడిన మెడికల్ స్కాం మరువకముందే, ఇప్పుడు అగ్రికల్చర్ బీఎస్సీ పరీక్షల్లో ప్రశ్నాపత్రాలను వాట్సాప్ ద్వారా ముందుగానే లీక్ చేసి, AI పెన్లతో రాసిన మోడరన్ స్కాం రాష్ట్రాన్ని దిగ్భ్రాంతికి గురి చేస్తోందన్నారు. ఇంత బహిరంగంగా, అక్రమంగా పరీక్షలు జరుగుతుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) ఏం చేస్తున్నట్లు అని ప్రశ్నించారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతుంటే, ప్రభుత్వం మొద్దు నిద్రలో మునిగి ఉందని విమర్శించారు. విద్యా సంస్థలు సైతం అవినీతికి కేంద్రంగా మారడం రాష్ట్ర ప్రభుత్వ దిగజారుడు తనానికి, రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) విలువల్లేని తనానికి నిదర్శనమన్నారు. పరీక్షల నిర్వహణలో అక్రమాలకు పాల్పడిన అధికారులపై తక్షణం చర్యలు తీసుకోవాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
Question Paper Leakage | ఇది లీకేజీల సర్కార్
ప్రశ్న పత్రాల లీకేజీపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత సైతం స్పందించారు. కాంగ్రెస్ పాలనలో ఉద్యోగ నియామకాల్లో అవకతవకలు, అగ్రికల్చర్ యూనివర్సిటీ పరీక్ష పేపర్లు లీక్ జరిగాయన్నారు. ముఖ్యమంత్రే విద్యాశాఖ మంత్రిగా ఉన్నా ఇలాంటి ఘటనలు జరగడం సిగ్గుచేటని విమర్శించారు. వర్సిటీల భూములు అమ్ముకొని సొమ్ము చేసుకోవడం తప్ప ఆయనకు విద్యార్థుల గోడు పట్టదని మండిపడ్డారు.