HomeUncategorizedElon Musk | ట్రంప్‌తో గొడవ.. 150 బిలియన్‌ డాలర్లు హరించుకుపోయిన మస్క్‌ సంపద

Elon Musk | ట్రంప్‌తో గొడవ.. 150 బిలియన్‌ డాలర్లు హరించుకుపోయిన మస్క్‌ సంపద

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్:Elon Musk | రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరంటారు. దీనికి తాజా ఉదాహరణగా నిలుస్తున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump), టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌. వీరిద్దరి మధ్య నెలకొన్న విభేదాలు టెస్లాపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.

గురువారం ఒక్కరోజే టెస్లా (Tesla shares) షేరు ధర 14.26 శాతం పడిపోయింది. దీంతో కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ 150 బిలియన్‌ డాలర్ల మేర హరించుకుపోయింది. ఇది మన టీసీఎస్‌ కంపెనీ మొత్తం మార్కెట్‌ క్యాప్‌ కంటే ఎక్కువ కావడం గమనార్హం.


ట్రంప్‌, మస్క్‌ల మధ్య గతంలో మంచి స్నేహం ఉండేది. ప్రధానంగా అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో వీరి మధ్య స్నేహం తారస్థాయిలో ఉంది. ట్రంప్‌ విజయం కోసం మస్క్‌ ఎంతగానో కృషి చేశారు. ట్రంప్‌ రెండోసారి గెలిచాక మస్క్‌కు ప్రాధాన్యత ఇచ్చారు. యూఎస్‌ రాజకీయాల్లో ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) కొత్త సూపర్‌ స్టార్‌ అంటూ పొగిడారు. ప్రభుత్వ వ్యయాలను తగ్గించడం, బ్యూరోక్రసీని సరళీకరించడం కోసం ఉద్దేశించి ఏర్పాటు చేసిన డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎఫీషియన్సీ(డోజ్‌)కి వివేక్‌ రామస్వామితో కలిపి మస్క్‌ను సంయుక్త సారథులుగా నియమించారు. ట్రంప్‌ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక మస్క్‌కు చెందిన టెస్లా స్టాక్‌ విలువ సుమారు 40 శాతం మేర పెరిగింది.

Elon Musk | ఒక్కసారిగా పరస్పర విమర్శలు

అయితే ఇదే సమయంలో ట్రంప్‌, మస్క్‌ అనుసరించిన విధానాలకు వ్యతిరేకంగా అమెరికాలో పెద్దఎత్తున నిరసనలు చెలరేగాయి. చైనా (China) మస్క్‌ను ఉపయోగించి ట్రంప్‌ను ప్రభావితం చేస్తోందన్న విమర్శలు వచ్చాయి. అనంతరం ఇద్దరి మధ్య ఏం జరిగిందో.. కానీ అధ్యక్షుడి విధానాలను టెస్లా అధినేత విమర్శించడం ప్రారంభించారు. ఆయన డోజ్‌ నుంచి బయటికి వచ్చాక ట్రంప్‌ పాలసీలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం బిగ్‌ అండ్‌ బ్యూటిఫుల్‌ (Big and Beautiful) పేరుతో తెస్తున్న బిల్లు ఖర్చులను పెంచి, అమెరికాను దివాలా తీయిస్తుందని పేర్కొంటున్నారు.

తనవల్లే ట్రంప్‌ గెలవగలిగారని మస్క్‌ పేర్కొంటుండగా.. ఆయన సహకారం లేకపోయినా తాను గెలిచేవాడినని ట్రంప్‌ అంటున్నారు. తనను విమర్శించే వారిని ఉపేక్షించే స్వభావం లేని ట్రంప్‌.. టెస్లాను టార్గెట్‌ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. మస్క్‌ వ్యాపారాలపై పన్నులు విధించే యోచనలో యూఎస్‌ ప్రభుత్వం ఉంది. మస్క్‌కు చెందిన రాకెట్‌ సంస్థ స్పేస్‌ ఎక్స్‌(SpaceX)తో సహా ఇతర కంపెనీలకు ప్రభుత్వంతో సుమారు 10 బిలియన్‌ డాలర్ల విలువైన ఒప్పందాలున్నాయి.

Elon Musk | టెస్లా షేర్లపై ప్రభావం

ఇద్దరి మధ్య విభేదాల నేపథ్యంలో ఆ కంపెనీలకు ప్రభుత్వ కాంట్రాక్ట్‌లను నిలిపివేస్తామని ట్రంప్‌ హెచ్చరించారు. దీనికి ప్రతిగా అమెరికాలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు దిశగా ఎలాన్‌ మస్క్‌ అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో వాల్‌స్ట్రీట్‌లో టెస్లా షేర్లు అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. ఈ ఎలక్ట్రిక్‌ కార్ల తయారీ కంపెనీ గత ట్రేడింగ్‌ సెషన్‌(Last trading session)లో 14 శాతం మేర నష్టపోయింది. సుమారు 150 బిలియన్‌ డాలర్ల మార్కెట్‌ క్యాప్‌ హరించుకుపోయింది.

Must Read
Related News