Homeఅంతర్జాతీయంRussia-India | డిసెంబర్​లో భారత పర్యటనకు పుతిన్.. తేదీల ఖరారుపై చర్చలు జరుపుతున్న రష్యా, భారత్

Russia-India | డిసెంబర్​లో భారత పర్యటనకు పుతిన్.. తేదీల ఖరారుపై చర్చలు జరుపుతున్న రష్యా, భారత్

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Russia-India | రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Russian President Vladimir Putin) డిసెంబర్ మాసంలో భారత పర్యటనకు రానున్నారు. ఈ నేపథ్యంలో న్యూఢిల్లీ, మాస్కో ప్రస్తుతం తేదీల ఖరారుపై దృష్టి సారించాయి.

23వ భారత్ – రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశంలో (India-Russia annual summit) భాగంగా పుతిన్ ఇండియాలో పర్యటించనున్నారు. రెండు దేశాల మధ్య దీర్ఘకాలంగా కొనసాగుతున్న వ్యూహాత్మక భాగస్వామ్యంలో కీలకమైన ఘట్టంగా ఈ పర్యటన ఉంటుందని భావిస్తున్నారు. రష్యా-ఉక్రెయిన్ (Russia-Ukraine) వివాదం ప్రారంభమైన తర్వాత పుతిన్ భారతదేశానికి వస్తుండడం ఇదే తొలిసారి.

పుతిన్ పర్యటనకు ముందు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ఇండియాలో పర్యటించే అవకాశం ఉందని తెలిసింది. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 80వ సమావేశం సందర్భంగా లావ్రోవ్.. ఉన్నత స్థాయి పర్యటన ప్రణాళికలను ధ్రువీకరించారు. డిసెంబర్లో పుతిన్ న్యూఢిల్లీ పర్యటనకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఆయన చెప్పారు. భారత్-రష్యా సంబంధాలను అమెరికా సుంకాలు ప్రభావితం చేయవని ఆయన స్పష్టం చేశారు.

Russia-India | కీలక రంగాలపై ఒప్పందాలు..

పుతిన్ ఇండియా పర్యటనకు రానున్న నేపథ్యంలో ఇరుదేశాల పలు కీలక రంగాల్లో ఒప్పందాలు కుదిరే అవకాశముంది. ఈ శిఖరాగ్ర సమావేశానికి సంబంధించిన ఎజెండాలో వాణిజ్యం, రక్షణ సహకారం, ఆర్థికం, ఆరోగ్య సంరక్షణ, మానవతా సంబంధాలు, సాంకేతిక భాగస్వామ్యాలు వంటి విస్తృత శ్రేణి అంశాలు ఉన్నాయి. భారతదేశం-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశం 2000 సంవత్సరంలో ప్రారంభమైంది. అప్పటి నుంచి కోవిడ్-19 మహమ్మారి (Covid-19 pandemic) సమయంలో మినహా ప్రతి ఏటా ఈ శిఖరాగ్ర సమావేశాలు జరుగుతూనే ఉన్నాయి.

Russia-India | పుతిన్ పర్యటనపై ఆసక్తి..

రష్యా (Russia) నుంచి చమురు కొంటున్నురనే కారణంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇండియాపై భారీగా సుంకాలు విధించారు. ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఇలాంటి తరుణంలో మాస్కోతో భారత వాణిజ్య సంబంధాలపై న్యూఢిల్లీ, వాషింగ్టన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న సమయంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇండియాలో పర్యటించనుండడం ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది.