అక్షరటుడే, వెబ్‌డెస్క్: Punjab Spurious Liquor | పంజాబ్లో కల్తీ మద్యం మరణ మృదంగం మోగిస్తోంది. ఇప్పటి వరకు కల్తీ మద్యం తాగి మరణించిన వారి సంఖ్య 23కు చేరింది. మంగళవారం 21 మంది మృతి చెందారు. చికిత్స పొందుతూ మరో ఇద్దరు మరణించినట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు ఈ కేసుకు సంబంధించి 16 మందిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను బుధవారం అమృత్సర్ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు వారికి రిమాండు విధించింది.
అమృత్సర్ జిల్లా భంగాలీ, పతాల్పురీ, తల్వాండి ఖుమ్మన్, కర్నాలా, మరారి, కలన్, భంగ్వాన్, థెరేవల్ గ్రామాలకు చెందిన పలువురు సోమవారం(మే 12న) రాత్రి కల్తీ మద్యం తాగి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే గురుద్వారాల ద్వారా ప్రకటన జారీ చేశారు. ఇప్పటి వరకు 23 మంది మృతి చెందారు. మరికొందరు చికిత్స పొందుతున్నారు.
Punjab Spurious Liquor : రూ.10 లక్షల పరిహారం
బాధిత కుటుంబాలను మంగళవారం పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ పరామర్శించారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. నిందితులను వదిలిపెట్టేది లేదని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
