అక్షరటుడే, ఇందూరు: Nizamabad Municipality | తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలు (municipal and corporation elections) రసవత్తరంగా సాగుతున్నాయి. ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారాలు చేస్తున్నారు. తమను గెలిపించమని ఇంటింటికి తిరిగి ఓటర్లను (voters) అభ్యర్థిస్తున్నారు.
మరి కొన్నిచోట్ల అభ్యర్థుల గెలుపు కోసం కుటుంబ సభ్యులు, తోబుట్టువులు, బంధువులు తెగ ప్రచారం చేసేస్తున్నారు. ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్నారు. కొందరు ఇంటింటికి చికెన్ పంపిణీ చేయడం, ఓటర్లకు మద్యం తాగించడం, మందు బాటిళ్లు పంపిణీ చేయడం, డబ్బులు ఎర వేయడం చేస్తున్నారు.
కాగా, మరికొందరు సేవ చేయడం ద్వారా ఓటర్లను ఆకర్షించేందుకు యత్నిస్తున్నారు. ప్రజాక్షేత్రంలోకి వెళ్లి, వారి సమస్యలను తెలుసుకొని తక్షణం పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇలాంటి ప్రయత్నమే చేశారు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ నేత. నిజామాబాద్ నగరంలో ని తొమ్మిదో వార్డులో బీఆర్ఎస్ తరఫున సోనీ అనే మహిళ పోటీ చేస్తున్నారు.
సోనీ తరఫున బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు డిల్లోడ్ ఆకాశ్ ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్నారు. తన చెల్లిని కార్పొరేటర్ గా గెలిపిస్తే.. దగ్గరుండి ప్రజల సేవ చేసుకుంటారని అభయమిస్తున్నారు. అయితే, ప్రచార సమయంలోనే ప్రజలు.. స్థానికంగా నెలకొన్న నీటి సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. నీటి కోసం తాము పడుతున్న కష్టాలను, పాట్లను వివరించారు.
దీంతో తక్షణం స్పందించిన ఆకాశ్.. నిల్చున్న చోటనే తన మనుషులకు కాల్ చేసి, వాటర్ ట్యాంకర్ తెప్పించారు. గత కొద్ది రోజులుగా నీటి సమస్యతో ఇబ్బంది పడుతున్న స్థానిక ప్రజలు.. ఆకాశ్ స్పందించి సమస్యను పరిష్కరించిన తీరు చూసి మురిసిపోయారు. మా ఓటు మీ చెల్లికే అంటూ అభయం ఇచ్చారు. మరోవైపు ఆకాశ్ స్పందించిన తీరు.. వీడియో సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో నెటిజన్లు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు.