అక్షరటుడే, ఆర్మూర్: Indiramma Housing Scheme | ఆలూర్ మండంలోని మాచర్ల గ్రామంలో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లపై (Indiramma Houses) అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎంపీడీవో గంగాధర్ ఆధ్వర్యంలో అధికారులు ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులతో మాట్లాడారు. ప్రభుత్వం అందిస్తున్న ఆర్థికసాయం, నిర్మాణ దశల ప్రకారం నిధుల విడుదల విధానం, పనుల నాణ్యత గురించి వివరించారు.
అనంతరం ఎంపీడీవో గంగాధర్ (MPDO Gangadhar) మాట్లాడుతూ.. ప్రభుత్వం నిజమైన అర్హులైన నిరుపేద కుటుంబాలకు సొంత ఇల్లు కల్పించాలనే లక్ష్యంతో ఇందిరమ్మ పథకాన్ని (Indiramma Scheme) పారదర్శకంగా అమలు చేస్తోందన్నారు. బేస్మెంట్ పూర్తయిన వారికి రూ. లక్ష, గోడలు నిర్మించిన తర్వాత మరో రూ. లక్ష, స్లాబ్ వేసిన తర్వాత రూ.2లక్షలు, ఇల్లు పూర్తిగా నిర్మించిన తర్వాత మరో రూ. లక్ష చొప్పున మొత్తంగా రూ. 5లక్షలు ప్రభుత్వం అందజేస్తుందని వివరించారు.
ఇది నిరుపేద కుటుంబాలకు గొప్ప అవకాశం అని, నిధులను సద్వినియోగం చేసుకుని తమ ఇళ్లను నాణ్యతతో నిర్మించుకోవాలని లబ్ధిదారులను ఆయన సూచించారు. ప్రతి దశలో పనులు పూర్తి చేసిన వెంటనే పంచాయతీ అధికారులు అప్డేట్ చేయడంతోనే నిధులు విడుదల అవుతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నసీర్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.