అక్షరటుడే, వెబ్డెస్క్: PT Usha | భారత ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు, పరుగుల రాణి పీటీ ఉష భర్త, కేంద్ర ప్రభుత్వ మాజీ ఉద్యోగి వి. శ్రీనివాసన్ శుక్రవారం తెల్లవారుజామున ఆకస్మికంగా మృతి చెందారు. కేరళ (Kerala)లోని వారి నివాసంలో ఈ విషాదకర సంఘటన జరిగింది.
తన నివాసంలో ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో కుటుంబ సభ్యులు వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి తరలించగా, వైద్యులు ఆయన మృతిని నిర్ధారించారు. కొంతకాలంగా వయస్సు సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హృదయపోటు కారణంగా ప్రాణాలు కోల్పోయారని కుటుంబ సభ్యులు తెలిపారు.
PT Usha | ఉష భర్త ఇక లేరు ..
శ్రీనివాసన్ (Srinivsan) పీటీ ఉషకు క్రీడా జీవితంలో అద్భుతమైన మద్దతుగా నిలిచిన వ్యక్తి. ఉష సాధించిన అంతర్జాతీయ పతకాల వెనుక ఆయన ప్రోత్సాహం కీలకపాత్ర పోషించింది. మంచి శిక్షణ, ప్రతి అంతర్జాతీయ పోటీ ముందస్తు సన్నాహకంలో ఆయన ఉషకు తోడుగా ఉన్నారు. ఆయన, ఉషకు ఉజ్వల్ అనే కుమారుడు ఉన్నారు. శ్రీనివాసన్ మృతికి స్పందిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) పీటీ ఉషను ఫోన్ చేసి ఆమెకు సానుభూతి ప్రకటించారు. కష్టకాలంలో ఆమెకు, ఆమె కుటుంబానికి ధైర్యం ప్రసాదించాలని ప్రార్థించారు. కేరళ ముఖ్యమంత్రి (Kerala Chief Minister) మరియు పలువురు క్రీడా ప్రముఖులు కూడా సంతాపం వ్యక్తం చేశారు.
శ్రీనివాసన్ కేవలం ఒక భర్తగా కాకుండా, ఉష అకాడమీ కార్యకలాపాల్లోనూ చురుగ్గా పాల్గొనేవారు. భావి క్రీడాకారులను తీర్చిదిద్దడంలో, శిక్షణ, సౌకర్యాల ఏర్పాట్లలో ఆయన కీలక సహకారం అందించారు. ఆయన మృతి క్రీడా లోకానికి నిస్సందేహంగా లోటు అని క్రీడాకారులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.