అక్షరటుడే, బాన్సువాడ:Palle Prakruthi Vanam | ప్రజలకు ఆహ్లాదాన్ని అందించేందుకు ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాలను పట్టించుకునేవారు కరువయ్యారు. గ్రామీణ ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం కల్పించేలా గత ప్రభుత్వం(Government) జీపీల్లో పల్లె ప్రకృతి వనాలను(Palle Prakruthi Vanam) ఏర్పాటు చేసింది. ఉపాధి హామీ పథకం కింద నిధులు మంజూరు చేసి ప్రకృతి వనాల్లో వివిధ రకాలు మొక్కలు నాటించింది. ప్రస్తుతం నిర్వహణ లేక ప్రకృతి వనాల్లోని మొక్కలు ఎండిపోయాయి.
కామారెడ్డి జిల్లాలో 661 పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేశారు. వాటి కోసం రూ.3.68 కోట్లు వెచ్చించారు. మొదట్లో వనాల నిర్వహణ బాధ్యతలు జీపీ(GP)లకు అప్పగించి అధికారుల పర్యవేక్షించడంతో పచ్చదనంతో కళకళలాడాయి. ప్రస్తుతం జీపీలకు ఎలాంటి నిధులు రావట్లేదు. ఉపాధి కూలీలను ఏర్పాటు చేయకపోవడంతో వాటి నిర్వహణపై నిర్లక్ష్యం ఏర్పడింది.
Palle Prakruthi Vanam | మందుబాబులకు అడ్డాలుగా..
కొన్ని గ్రామాల్లోని వనాల్లో కనీస నిర్వహణ లేకపోవడంతో చెత్తాచెదారంతో అపరిశుభ్రంగా మారాయి. చీకటి పడగానే గ్రామాల్లో మద్యం ప్రియులకు అడ్డాగా పల్లెప్రకృతి వనాలు మారాయి. పంచాయతీలకు ప్రభుత్వ నిధులు విడుదల చేస్తే.. పల్లె ప్రకృతి వనాలు బాగు పడతాయని గ్రామస్థులు పేర్కొంటున్నారు.
