అక్షరటుడే, కామారెడ్డి: Dharani | కామారెడ్డిలోని ధరణి వెంచర్లో మౌలిక వసతులు కల్పించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. పట్టణంలోని గెలాక్సీ ఫంక్షన్ హాల్లో ఆదివారం సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్లాట్లు కొనే ముందు తమకు అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చి అనంతరం పట్టించుకోవడం మానేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2022లో నాలుగు దశలలో 543 ఓపెన్ ప్లాట్లకు వేలం వేయగా.. 357 ప్లాట్లను బాధితులు కొనుగోలు చేశారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఎలాంటి సదుపాయాలు కల్పించలేదని వారు వాపోయారు.
కొనుగోలు చేసిన బాధితులు బ్యాంకులలో రుణాలు తీసుకుని బయట వడ్డీలకు డబ్బులు సమకూర్చుకున్నారని, ఇప్పటి వరకు తాగునీరు, మురికి కాలువలు, రోడ్లు, విద్యుత్ సౌకర్యాలు కల్పించలేదన్నారు. ధరణి వెంచర్లో (Dharani Venture) ఇళ్లు కొన్న వారు కనీస సౌకర్యాలు లేక అవస్థలు పడుతున్నారని వాపోయారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వసతులు కల్పించాలని కోరారు. లేకపోతే భవిష్యత్తులో మిగిలిన ప్లాట్లు, ఇళ్లను వేలం చేయాలని చూస్తే అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో రాజ నరసింహారెడ్డి, జశ్వంత్ రావు, వెంకటరెడ్డి, కైలాష్ రాజేశ్వర్ రావు, అనిల్ కుమార్, బాధితులు పాల్గొన్నారు.