అక్షరటుడే, వెబ్‌డెస్క్: USA No Kings Protest | అమెరికాలో (America) ఆందోళనలు ఉద్రిక్తంగా మారాయి. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అధికారంలోకి రెండోసారి వచ్చాక ఆయన తీసుకుంటున్న కఠిన విధానాలపై ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ రోడ్లపైకి వస్తున్నారు.
‘నో కింగ్స్’ (NO Kings) పేరుతో న్యూయార్క్, వాషింగ్టన్ డీసీ, షికాగో, లాస్ ఏంజెలెస్ (Los Angels) సహా 50 రాష్ట్రాలలో 2,500 కంటే ఎక్కువ ప్రాంతాల్లో నిరసనలు కొనసాగుతున్నాయి. నిరసనల్లో వలస విధానం, భద్రతా పరిపాలన, ప్రభుత్వ ఉద్యోగాల్లో కోత, షట్‌డౌన్, విద్యా విధానాలపై ప్రజలు పెద్ద సంఖ్యలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. న్యూయార్క్‌లోనే (New York) లక్ష మందికి పైగా మంది నిరసనకారులు శాంతియుతంగా ప్రదర్శనలు నిర్వహించారు. ఈ నిరసనల్లో ఎలాంటి అరెస్టులు జరగలేదని న్యూయార్క్ పోలీస్ డిపార్ట్‌మెంట్ ప్రకటించింది.
USA No Kings Protest | ఆందోళనలు ఉధృతం..
వీటితోపాటు బోస్టన్, చికాగో (Chicago), ఉత్తర వర్జీనియా వంటి ప్రాంతాల్లో కూడా ఆందోళనకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నిరసనల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ప్రజల కేంద్రీకృత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ నిరసనలకు డెమోక్రాట్లతోపాటు పలు సివిల్ సొసైటీలు, ప్రముఖులు మద్దతు వ్యక్తం చేశారు. అయితే, ఆందోళనకారులు తమ ప్రదర్శనలను శాంతియుతంగా కొనసాగించాలి అని కోరారు. వైట్ హౌస్ మరియు రిపబ్లికన్ పార్టీ ఈ నిరసనలను తీవ్రంగా ఖండిస్తూ, వాటిని “హేట్ అమెరికా” ఉద్యమాలుగా పేర్కొన్నారు. డొనాల్డ్ ట్రంప్ ఫాక్స్ బిజినెస్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, “వారు నన్ను రాజు అని అంటున్నారు, కానీ నిజానికి నేను రాజు కాదని” అన్నారు.
తాజా పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర గవర్నర్లు (State Governers) అప్రమత్తమయ్యారు. జాతీయ బలగాలను ముందస్తుగా రంగంలోకి తెచ్చి, ఏవైనా ఉద్రిక్తతలు రాకుండా చర్యలు చేపట్టుతున్నారు. ఈ ఆందోళనల పరిస్థితులు అమెరికాలో ప్రజాస్వామ్య, రాజకీయ వాతావరణంపై గణనీయమైన ప్రభావం చూపవచ్చు.