అక్షరటుడే, నిజామాబాద్ రూరల్: Indiramma Housing Scheme | ఇందిరమ్మ ఇల్లు రాలేదని నిరసన తెలుపుతూ ఓ వ్యక్తి సెల్‌టవర్ ఎక్కిన ఘటన నిజామాబాద్ రూరల్(Nizamabad Rural) మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రూరల్ మండలంలోని మల్లారం గ్రామానికి చెందిన సాయిలు పేరు ఇటీవల ఇందిరమ్మ ఇళ్ల(Indiramma illu) ఎంపిక జాబితాలో రాలేదు. గతంలో పేరు జాబితాలో రాగా బేస్మెంట్ వరకు ఇల్లు కట్టాడు. కాని తాజాగా విడుదల చేసిన జాబితాలో పేరు లేకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యాడు.
గురువారం ఉదయం గ్రామంలో సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపాడు. స్థానిక కాంగ్రెస్ నాయకులు వెంటనే రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డికి (Rural MLA Bhupathi Reddy) సమాచారం ఇచ్చారు. ఆయన స్థానిక నాయకులతో మాట్లాడి సాయిలుకు ఇందిరమ్మ ఇల్లు మంజురయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు. దీంతో సాయిలు టవర్ దిగాడు. సమస్య సద్దుమణగడంతో స్థానికులు, కాంగ్రెస్ నాయకులు ఊపిరి పీల్చుకున్నారు.