అక్షరటుడే, ఇందూరు : Nizamabad City | ఉపాధి చట్టం సవరణను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని వామపక్ష నాయకులు అన్నారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని గాంధీ చౌక్ వద్ద గాంధీ విగ్రహం ఎదుట సీపీఎం, సీపీఐ, న్యూడెమోక్రసీ మాస్‌లైన్, ఆర్ఎస్పీ, లిబరేషన్ పార్టీ (Liberation Party) ఆధ్వర్యంలో నిరసనకు దిగారు.
Nizamabad City | చట్టాన్ని నీరుగార్చే ప్రక్రియ..
ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు, న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య (Akula Papayya), మాస్‌లైన్ జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ (Vanamala Krishna) మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ చట్టంలో మార్పులు తీసుకొచ్చి పేదల పొట్టగొడుతోందన్నారు. చట్టాన్ని నీరుగార్చి జీరాంజీ చట్టాన్ని తీసుకొచ్చిందన్నారు. ఈ చట్టం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలపై విపరీతమైన భారం పడుతుందన్నారు. అలాగే చట్టం పేరు మార్చి స్వాతంత్య్ర సమరయోధులను కేంద్ర ప్రభుత్వం అవమానించిందన్నారు. కూలీలకు అధికంగా కూలి ఇవ్వడం ఇష్టంలేక ఇలాంటి చట్టాన్ని తీసుకొచ్చిందని ఆరోపించారు.
Nizamabad City | చట్టాన్ని సవరించాలి..
ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే ఆ చట్టాన్ని సవరించాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ కూలీలకు 200 రోజుల పని కల్పించడానికి అదే విధంగా రోజుకు రూ. 600 కూలీ చెల్లించాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీ (BJP) అవలంభిస్తున్న విధానాలను ఎండగడతామని చెప్పారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు అన్వర్, ఆర్ఎస్పీ నాయకులు అనిల్ లిబరేషన్ నాయకులు ఖాజా మొయినుద్దీన్, సీపీఎం నాయకులు పెద్ది వెంకట్ రాములు, వెంకటేష్, అనసూయమ్మ, అనిత, గంగాధర్, న్యూడెమోక్రసీ నాయకులు శ్రీధర్, భూమన్న, మల్లికార్జున్, మాస్‌లైన్ నాయకులు సుధాకర్, నరేందర్, వెంకన్న ఆర్ఎస్పీ నాయకులు రాములు, నరేష్ కార్యకర్తలు పాల్గొన్నారు.