అక్షరటుడే, కామారెడ్డి: Panchayat Elections | ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో (Sarpanch elections) తమ గ్రామానికి ఎస్టీ రిజర్వేషన్ వస్తే బీసీ కులానికి చెందిన వ్యక్తి ఎస్టీ సర్టిఫికెట్తో (fake ST certificate) పోటీ చేసి గెలిచాడని అన్నారం తండావాసులు ఆరోపించారు. ఈ మేరకు శుక్రవారం కామారెడ్డి కలెక్టరేట్ (Kamareddy Collectorate) ఎదుట ధర్నాకు దిగారు. అనంతరం కలెక్టరేట్ కార్యాలయ అధికారికి వినతిపత్రం అందజేశారు. అంతకుముందు రాజంపేట ఎంపీడీవోకు సైతం వినతిపత్రం అందజేశారు.
Panchayat Elections | ప్రజావాణిలో ఫిర్యాదు చేసినప్పటికీ..
ఈ సందర్భంగా తండా వాసులు మాట్లాడుతూ.. అన్నారం గ్రామ పంచాయతీ (Annaram Gram Panchayat) పరిధిలో అన్నారం తండా కూడా ఉంటుందన్నారు. అన్నారం గ్రామంలో 220 ఓటర్లు, తండాలో 260కి పైగా ఓటర్లు ఉన్నారని, దాంతో సర్పంచ్ ఎన్నికల్లో ఎస్టీ రిజర్వేషన్ వచ్చిందన్నారు. అయితే తండా నుంచి ముగ్గురు అభ్యర్థులు నామినేషన్ వేశామని, అన్నారం గ్రామం నుంచి బీసీ-డీ కులానికి చెందిన ముత్యాల రవీందర్ నామినేషన్ వేశాడన్నారు. అయితే రవీందర్ నాయక్ పోడ్ కింద ఫేక్ ఎస్టీ సర్టిఫికెట్ తెచ్చుకుని ఎన్నికల్లో పోటీ చేశాడని తెలిపారు. ఎన్నికలకు ముందే గ్రామంలో పలువురు ఎస్టీ సర్టిఫికెట్ తీసుకున్న విషయాన్ని గత అక్టోబర్ 18 న ప్రజావాణిలో ఫిర్యాదు చేశామన్నారు.
Panchayat Elections | స్థానిక సంస్థల అదనపు కలక్టర్‌కు సైతం..
ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక ఈనెల 1న రాజంపేట తహశీల్దార్‌కు, అదేరోజు జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌కు ఫేక్ సర్టిఫికెట్తో ముత్యాల రవీందర్ నామినేషన్ వేసిన విషయంపై ఫిర్యాదు చేశామన్నారు. అయినా అధికారులు పట్టించుకోలేదని ఆరోపించారు. తహశీల్దార్‌కు అడిగితే స్క్రూట్నీలో తీసేస్తారని చెప్పారని అయినా తొలగించలేదన్నారు. సర్టిఫికెట్ విషయమై తహశీల్దార్‌ను అడిగితే 2022 నుంచి అన్నారం గ్రామంలో ముత్యాల కుటుంబం వారికి ఎలాంటి కులం సర్టిఫికెట్లు జారీ చేయలేదని చెప్పారని పేర్కొన్నారు. 2015 కంటే ముందు బీసీ-డీ లో ఉన్న ముత్యాల కుటుంబంలోని కొంతమంది నాయక్ పోడ్ కింద ఎస్టీ సర్టిఫికెట్ పొందారని తెలిపారు.
Panchayat Elections | 2015లో బీసీ–డీలో ఉండి.. ఇప్పుడు ఎస్టీ ఎలా..
సర్పంచ్‌గా పోటీ చేసి గెలిచిన ముత్యాల రవీందర్ పాఠశాలలో రిజిస్టర్లో బీసీ–డీగా ఉందని, ఇప్పుడు ఎస్టీ సర్టిఫికెట్ ఎలా మారిందని ప్రశ్నించారు. ముత్యాల కుటుంబాలలో సగం మంది నాయక్ పోడ్ ఎస్టీలుగా ఫేక్ సర్టిఫికెట్లు పొందారని, ఇప్పుడు సర్పంచ్ పదవి గెలిచారని, రేపు ఉద్యోగాలు కూడా పొందుతారని ఆరోపించారు. ఎస్టీ కాకున్నా ఎస్టీ సర్టిఫికెట్ ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని, ఫేక్ సర్టిఫికెట్‌పై గెలిచిన సర్పంచ్ పదవిని రద్దు చేసి తిరిగి ఎన్నిక నిర్వహించి తమకు న్యాయం చేయాలని కోరారు.