అక్షరటుడే, ఇందూరు: TUCI | కార్మికులకు వ్యతిరేకంగా ఉన్న నాలుగు లేబర్ కోడ్లపై గెజిట్ విడుదల చేయడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా (Trade Union Center of India) జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నరేందర్, సుధాకర్ తెలిపారు.
జిల్లా కేంద్రంలోని ధర్నాచౌక్లో కేంద్ర ప్రభుత్వ (central government) దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాలను సవరణ పేరుతో లేబర్ కోడ్లుగా హడావిడిగా గెజిట్ చేయడం తగదన్నారు. కార్పొరేట్ పెట్టుబడిదారులకు అనుకూలంగా తీసుకొచ్చిన కార్మిక చట్టాల సవరణ జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
సుదీర్ఘకాల అనేక త్యాగాలు, పోరాటాలు చేసి సాధించుకున్న చట్టాలు కాలగర్భంలో కలిసిపోయే విధంగా మోదీ ప్రభుత్వం (Modi government) చేస్తుందన్నారు. ఇన్ని రోజులుగా వెనకడుగు వేస్తూ వచ్చిన కేంద్ర ప్రభుత్వం.. బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడంతో కార్పొరేట్ అనుకూల విధానాలను వేగవంతం చేసిందని ఆరోపించారు. అందులో భాగంగానే 29 కార్మిక చట్టాలు రద్దుచేసి, వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్లను అమల్లోకి తెచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో టీయూసీఏ జిల్లా నాయకులు సాయారెడ్డి, మురళి, రవి కిరణ్, విఠల్, పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి గణేష్ తదితరులు పాల్గొన్నారు.
