అక్షరటుడే, వెబ్‌డెస్క్: Chhattisgarh Protest | ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్‌లో (Raigarh) నిరసనలు హింసాత్మకంగా మారాయి. కోల్ మైనింగ్ ప్రాజెక్ట్‌కు (coal mining project) వ్యతిరేకంగా స్థానికులు కొద్ది రోజులుగా ఆందోళనలు నిర్వహించారు.
రాయ్‌గఢ్ జిల్లాలోని తమ్నార్ ప్రాంతంలో బొగ్గు గనుల ప్రాజెక్టుకు వ్యతిరేకంగా డిసెంబర్ 12 నుంచి లిబ్రా గ్రామంలోని సిహెచ్పి చౌక్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం పెద్ద ఎత్తున ఆందోళనకారులు తరలివచ్చారు. ఈ క్రమంతో నిరసన హింసాత్మకంగా మారడంతో అనేక మంది పోలీసులు గాయపడ్డారు. వాహనాలను సైతం ఆందోళనకారులు తగులబెట్టారు.
Chhattisgarh Protest | పోలీసు వాహనాలకు నిప్పు
జిందాల్ పవర్ లిమిటెడ్ (Jindal Power Limited) బొగ్గు నిర్వహణ కర్మాగారంలోకి కూడా జనం చొరబడి, కన్వేయర్ బెల్ట్, రెండు ట్రాక్టర్లు మరియు ఇతర వాహనాలను తగలబెట్టారని అధికారులు తెలిపారు. నిరసనకారులు రాళ్ల దాడికి పాల్పడి, పోలీసు బస్సు, జీపు, అంబులెన్స్‌కు నిప్పంటించడంతో పాటు, అనేక ఇతర ప్రభుత్వ వాహనాలను ధ్వంసం చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. శనివారం ఉదయం దాదాపు 300 మంది నిరసనకారులు సంఘటనా స్థలంలో గుమిగూడారు. అనంతరం మధ్యాహ్నం సమయంలో సమీప గ్రామాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పోలీసులు సముదాయించిన వారు వినకుండా ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో పోలీసు బారికేడ్లను బద్దలు కొట్టి, రాళ్లు, కర్రలతో సిబ్బందిపై దాడి చేశారని పోలీసులు తెలిపారు.
Chhattisgarh Protest | పోలీసులకు గాయాలు
ఈ ఘటనలో సబ్-డివిజనల్ పోలీస్ ఆఫీసర్ అనిల్ విశ్వకర్మ, తమ్నార్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జి కమల పుసం, ఒక కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే విద్యావతి సిదార్, రాయ్‌గఢ్ కలెక్టర్ మయాంక్ చతుర్వేది, పోలీసు సూపరింటెండెంట్ దివ్యాంగ్ పటేల్ ఘటనా స్థలానికి చేరుకుని జనాన్ని శాంతింపజేశారు. అయినా కూడా వారు మరోసారి రాళ్లు రువ్వారు. కాగా ప్రతిపాదిత మైనింగ్ ప్రాజెక్టును రద్దు చేయాలని స్థానిక గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.