అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: MP Arvind | జిల్లాలో చేపట్టిన మూడు రైల్వేఓవర్ బ్రిడ్జిల (Railway over bridge) నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ దసరా తర్వాత పెద్దఎత్తున ఉద్యమిస్తామని ఎంపీ అర్వింద్ తెలిపారు. దిశా సమావేశం (Disha meeting) అనంతరం మంగళవారం కలెక్టరేట్ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడారు.
జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌తో పాటు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలకు బ్రిడ్జి నిర్మాణ పనులు కనబడడం లేదా అని ప్రశ్నించారు. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి (MLA Sudarshan Reddy) ఇక్కడ ఇంటి నిర్మాణం బాగా చక్కబెట్టుకుంటున్నారని.. కానీ హైదరాబాద్ వెళ్లే మార్గంలో మాధవనగర్ వద్ద బ్రిడ్జి పనులు కనపించడం లేదా అంటూ వ్యాఖ్యానించారు.
మృతి చెందిన కుటుంబాలకు రూ.20వేలు తమ అకౌంట్లో వేసేలా కేంద్ర ప్రభుత్వం పథకాన్ని ప్రారంభించిందని ఈ పథకాన్ని బీజేపీ కార్యకర్తలు ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. నిజామాబాద్, ఆర్మూర్ ఫ్లైఓవర్ బ్రిడ్జి (Nizamabad and Armoor Railway over bridge) నిర్మాణానికి మంజూరు చేసిన రూ. 3.50 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం డైవర్ట్ చేసిందన్నారు. నేషనల్ హైవే, సెంట్రల్ రోడ్ ఫండ్స్ కింద ఎనిమిదింటిని ప్రపోజల్ చేస్తే అందులో ఆరింటిని కాంగ్రెస్ కట్ చేయడం ఎంతవరకు సమంజసం అన్నారు.
MP Arvind | అమృత్ పథకం పనులు అంతంతే..
అమృత్ పథకం (Amrut scheme) కింద జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలకు రూ. 400 కోట్లు మంజూరు చేసి రెండేళ్లు గడుస్తున్నా.. 10 శాతం పనులు కూడా పూర్తి చేయకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. అతిపెద్ద సంస్థ అయిన మెగా ఇంజినీరింగ్ (Mega Engineering) దగ్గర కార్మికులు లేరు.. మెటీరియల్ లేదనడం.. ప్రజలను మభ్యపెట్టడమే అవుతుందన్నారు. ఎంపీ ల్యాడ్స్ కింద పనులు మంజూరైతే వాటిని ముందుకు సాగకుండా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుపడుతుందని ఆయన విమర్శించారు.
భారీ వర్షాలు వరదల వల్ల దెబ్బతిన్న రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన రూ.పదివేలు పొలాల్లో ఏ మూలకు సరిపోవని పేర్కొన్నారు. గర్భిణులకు, పేద విద్యార్థులకు అందించే కోడిగుడ్లలోనూ రాష్ట్ర ప్రభుత్వం స్కామ్ చేస్తోందన్నారు. 70 గ్రాములు కోడిగుడ్డును అందించాల్సి ఉండగా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. విలేకరుల సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణతో పాటు జిల్లాకు చెందిన బీజేపీ నాయకులు ప్రతినిధులు పాల్గొన్నారు.