అక్షరటుడే, వెబ్డెస్క్ : Andhra Pradesh | ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి వేగం పెంచారు. ఇప్పటికే ఉన్న జిల్లాల విభజనలో కొన్ని సవరణలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇందుకోసం మంత్రివర్గ ఉపసంఘం (Cabinet Subcommittee) చర్చలు కొనసాగిస్తోంది.
రాష్ట్రంలోని పలు జిల్లాల ప్రజల నుంచి వచ్చిన అభ్యర్థనలను పరిశీలించిన అనంతరం, కొన్ని నియోజకవర్గాలను పొరుగు జిల్లాల్లో విలీనం చేసే ప్రతిపాదనలు తెరపైకి వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం.. గన్నవరం, నూజివీడు నియోజకవర్గాలను ఎన్టీఆర్ జిల్లాలో (NTR District) కలపాలని, కైకలూరు నియోజకవర్గాన్ని కృష్ణా జిల్లాలో కొనసాగించాలని మంత్రివర్గ ఉపసంఘం పరిశీలిస్తోంది. విజయవాడ పరిధిలో ఉండే పెనమలూరు నియోజకవర్గం మాత్రం కృష్ణా జిల్లాలోనే ఉంచనున్నారు.
Andhra Pradesh | కీలక ప్రతిపాదన..
ఇప్పటికే రెండు కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. మార్కాపురం, మదనపల్లెలను కొత్త జిల్లాల కేంద్రాలుగా చేయాలని నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం, పీలేరు, అద్దంకి, గిద్దలూరు, మడకశిరలను కొత్త రెవెన్యూ డివిజన్లుగా ఏర్పాటు చేయాలని కూడా ప్రతిపాదిస్తోంది. తాజాగా మరిన్ని రెవెన్యూ డివిజన్ల సవరణలు కూడా పరిశీలనలో ఉన్నాయి. ఈ ప్రతిపాదనలన్నీ బుధవారం సచివాలయంలో జరిగే మంత్రివర్గ ఉపసంఘ సమావేశంలో చర్చకు రానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మరికొన్ని రెవెన్యూ డివిజన్ల పునర్వ్యవస్థీకరణపై కూడా చర్చించనున్నారు. ఈ సిఫారసులను సీఎం చంద్రబాబు (CM Chandrababu) వద్ద సమీక్షించిన అనంతరం, నవంబర్ 10న జరగనున్న కేబినెట్ సమావేశంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
ప్రభుత్వ వర్గాల ప్రకారం.. ఈ పునర్వ్యవస్థీకరణతో పరిపాలన మరింత సులభతరం అవుతుందని భావిస్తున్నారు. ఒక నియోజకవర్గంలోని మండలాలన్నీ ఒకే రెవెన్యూ డివిజన్‌లో (Revenue Division) ఉండేలా కొత్త పద్ధతిలో రూపకల్పన చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. వైకాపా ప్రభుత్వ కాలంలో సరైన కసరత్తు లేకుండా హడావుడిగా చేసిన జిల్లాల విభజన వల్ల అనేక సమస్యలు ఉత్పన్నమయ్యాయని అధికారులు గుర్తించారు. ఈసారి అలాంటి తప్పు పునరావృతం కాకుండా శాస్త్రీయంగా, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పునర్వ్యవస్థీకరణ చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. జనగణన ప్రక్రియ డిసెంబరు నెలాఖరులోపు పూర్తవ్వాల్సి ఉండడంతో, జిల్లాల మరియు రెవెన్యూ డివిజన్ల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను కూడా అదే లోపు పూర్తి చేయాలని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.
