అక్షరటుడే, వెబ్డెస్క్:KTR | స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా దామాషా ప్రకారం రాష్ట్రమంతటా బీసీలకు టికెట్లు ఇస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.తారకరామారావు సంచలన ప్రకటించారు. గతంలో బీసీలకు న్యాయం చేసింది, చేసేది కూడా బీఆర్ఎస్సేనని, రేపు కూడా బహుజనులకు వారి న్యాయమైన వాటాను ఇచ్చేది బీఆర్ఎస్ మాత్రమేనని తెలిపారు. గిఫ్ట్ ఏ స్మైల్‌లో భాగంగా ఆదివారం పరకాలలో మహిళలకు కుట్టు మిషన్లు, (KCR Kits)ను కేటీఆర్ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో అద్భుతమైన మెజారిటీతో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తేనే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు సెట్ అవుతారని చెప్పారు. పరకాల నియోజకవర్గంలో గతంలో 58 శాతం ఎంపీటీసీ సీట్లను, 49శాతం సర్పంచ్ స్థానాలకు బీసీలకే ఇచ్చామని గుర్తు చేశారు.
KTR | కాంగ్రెస్ వల్ల పరిశ్రమలు తిరుగుముఖం
రాష్ట్రంలో రేవంత్ సర్కారు(Revanth Government) ఒత్తిళ్లతో అనేక పరిశ్రమలు వెనుకడుగు వేస్తున్నాయని కేటీఆర్ ఆరోపించారు. దేశంలోనే అతిపెద్ద కాకతీయ టెక్స్ టైల్ పార్కులో 25 వేల మందికి ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించిన కీటెక్స్ సంస్థను కాంగ్రెస్ నేతలు బెదిరిస్తున్నారని ఆరోపించారు. తాము చెప్పిన వారికే ఉద్యోగాలు ఇవ్వాలన్న కాంగ్రెస్ గుండాయిజంతో పరిశ్రమలు పారిపోయే పరిస్థితి దాపురించిందన్నారు.
కాకతీయ టెక్స్ టైల్ పార్కులో (Kakatiya Textile Park) కాలువ నిర్మాణానికి జనవరిలో రూపొందించిన రూ.137 కోట్ల అంచనాలు కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేల ధనదాహంతో రూ.297 కోట్లకు పెరిగాయన్నారు. కాలువ నిర్మాణం పేరుతో వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతలు (Warangal district Congress Leaders) రూ.167 కోట్లు దోచుకోవాలనుకున్నారని చెప్పారు. కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కు కు పరిశ్రమలను తెప్పించి తెలంగాణ యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని బీఆర్ఎస్ అనుకుంటే, కాంగ్రెస్ నేతలు మాత్రం దాన్ని నిలువు దోపిడీ చేసే కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. ప్రశ్నించకపోతే కాంగ్రెస్ నేతలు చేస్తున్న దోపిడీ ఆగదన్న కేటీఆర్ (KTR), రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఈ అక్రమాలపై నిలదీస్తామన్నారు.
KTR | హామీల ఎగవేత
ఎన్నికల ముందర కాంగ్రెస్ పార్టీ (Congress Party) అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక వాటిని ఎగవేసిందని కేటీఆర్ విమర్శించారు. మొన్న పార్లమెంటు ఎన్నికలప్పుడు రైతుబంధువేసి ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయని మళ్లీ రైతుబంధు వేశారని తెలిపారు. తెలంగాణలోని (Telangana) ప్రతీ ఆడబిడ్డకు రాష్ట్ర ప్రభుత్వం 50 వేల రూపాయలు బాకీ ఉన్నదన్నారు.
చారాణ కోడికి బారాణ మసాలా అన్నట్టు స్వయం సహాయక బృందాలకు 3000 కోట్ల రూపాయలు ఇవ్వాల్సిన రేవంత్ ప్రభుత్వం కేవలం 300 కోట్లు ఇచ్చి సంబరాలు చేసుకోమంటున్నదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల (Local Body Elections) ప్రచారానికి వచ్చే కాంగ్రెస్ నాయకులకు సమ్మక్క- సారక్క, రాణి రుద్రమ వారసురాళ్లయిన వరంగల్ ఆడబిడ్డలు కర్రు కాల్చి వాత పెట్టాలని పిలుపునిచ్చారు.
KTR | ఎరువుల కొరత..
కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జనవరిలోనే ఎరువులు కొని బఫర్ స్టాక్ చేసుకునేదని, అందుకే ఆయన సీఎంగా ఉన్నన్ని రోజులు యూరియా దుకాణాల ముందు లైన్లో చెప్పులు, ఆధార్ కార్డులు కనిపించలేదన్నారు. కానీ ఇవాళ ఎక్కడ చూసినా రైతుల లైన్లే కనిపిస్తున్నాయన్నారు. టైంకి యూరియా, ఎరువులు, విత్తనాలు ఇవ్వలేని ఈ ముఖ్యమంత్రికి పదవిలో ఉండే అర్హత లేదన్నారు.
కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేస్తానని రేవంత్ రెడ్డి ప్రగల్బాలు పలుకుతున్నాడని, పరకాల నియోజకవర్గంలో ఇండ్లు నిర్మించుకున్న 3 వేల మంది గృహలక్ష్మి లబ్ధిదారులకు డబ్బులు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. లబ్ధిదారుల తరపున పరకాల మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి కోర్టుకు పోతే, న్యాయస్థానం చెప్పినా కూడా రేవంత్ ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. 3000 మంది గృహలక్ష్మి లబ్ధిదారులకు న్యాయం జరిగేదాకా పోరాడుతామని.. అసెంబ్లీలో కొట్లాడుతామని చెప్పారు.
