Homeతాజావార్తలుHarish Rao | ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి : హరీశ్​రావు

Harish Rao | ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి : హరీశ్​రావు

బీఆర్​ఎస్​ నాయకులు సోమవారం ఆటోల్లో ప్రయాణించి నిరసన తెలిపారు. ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Harish Rao | ఆటో డ్రైవర్లకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయాలని మాజీ మంత్రి హరీశ్​రావు డిమాండ్​ చేశారు. డ్రైవర్ల సమస్యలు తెలుసుకోవడానికి సోమవారం ఆయన ఆటోలో ప్రయాణించారు. ఎర్రగడ్డలో ఆటో డ్రైవర్లతో మాట్లాడారు.

కాంగ్రెస్ (Congress) అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆటో డ్రైవర్ల జీవితాలు మరింత దిగజారాయని హరీశ్​రావు అన్నారు. 161 మంది డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ ఎన్నికల్లో గెలవడానికి తప్పుడు హామీలతో ఆటో కార్మికులను మోసం చేశారని విమర్శించారు. ప్రతి డ్రైవర్‌కు ఏటా రూ.12 వేలు ఇస్తామని హామీ ఇచ్చారని, కానీ అమలు చేయడం లేదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండేళ్లుగా ఒక్క హామీ కూడా అమలు చేయలేదని విమర్శించారు. ఆటో డ్రైవర్లకు (Auto Drivers) రెండేళ్లకు సంబంధించిన రూ.24 వేలు వెంటనే చెల్లించాలని డిమాండ్​ చేశారు.

Harish Rao | రాహుల్​గాంధీని అడ్డుకుంటారు

గతంలో ఓట్ల కోసం ఆటోలో ప్రయాణించి హామీలు ఇచ్చిన రాహుల్​గాంధీ (Rahul Gandhi)ని ఆటో డ్రైవర్లు అడ్డుకుంటారని హరీశ్​రావు అన్నారు. రాహుల్ గాంధీ మళ్లీ హైదరాబాద్ వస్తే.. మొత్తం ఆటోలన్నీ తెచ్చి శంషాబాద్‌లో అడ్డం పెట్టి కార్మికులు నిలదీస్తారన్నారు. రేవంత్ రెడ్డి (Revanth Reddy) కళ్లు తెరిపించాలని, రాహుల్ గాంధీకి ఆటో కార్మికుల బాధ తెలియాలని బీఆర్​ఎస్​ ఆధ్వర్యంలో ఆటోలు ఎక్కి నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు.

Harish Rao | ఆటో నడిపిన మాజీ మంత్రి

ఆత్మహత్య చేసుకున్న 161 మంది ఆటో డ్రైవర్ల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించాలని హరీశ్​రావు (Harish Rao) కోరారు. బీఆర్​ఎస్​ అధికారంలోకి వచ్చాక ఆటో డ్రైవర్లను సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్​కు ఆటో డ్రైవర్లు జూబ్లీహిల్స్​ ఉప ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని ఆయన కోరారు. కాగా ఆటో డ్రైవర్ల సమస్యలు తెలుసుకునేందుకు బీఆర్ఎస్ మహిళా నేతలు సైతం ఆటోలో ప్రయాణించారు. న్యూ ఎమ్మెల్యే క్వార్ట్రర్స్ నుంచి బుద్దభవన్‌లోని మహిళా కమిషన్‌కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు (BRS MLA) మాలోత్ కవిత, సునీత మహేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్​రెడ్డి తదితరులు ఆటోలో ప్రయాణించారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్​యాదవ్​ ఆటో నడిపి నిరసన తెలిపారు.