అక్షరటుడే, వెబ్డెస్క్: Kumuram Bheem Project | పది టీఎంసీల సామర్థ్యంలో నిర్మించిన ప్రాజెక్ట్ ప్రమాదపుటంచున ఉంది. వేల ఎకరాలకు సాగు నీరు అందించే జలాశయానికి ముంపు పొంచి ఉంది. అయినా ప్రభుత్వం మాత్రం చర్యలు చేపట్టడం లేదు. ఆసిఫాబాద్ జిల్లాలో (Asifabad District) పెద్దవాగుపై 2005లో కుమురంభీమ్ ప్రాజెక్ట్ నిర్మించారు. పది టీఎంసీల సామర్థ్యంలో 45 వేల ఎకరాలకు సాగు నీరు అందించాలనే లక్ష్యంతో ఈ జలాశయం నిర్మాణం చేపట్టారు.
Kumuram Bheem Project | నాలుగేళ్ల క్రితం బీటలు
కుమురం భీమ్ ప్రాజెక్ట్(Kumuram Bheem Project) ఆనకట్టకు నాలుగేళ్ల క్రితం బీటలు వారాయి. పలు చోట్ల ఆనకట్ట కుంగింది. దీంతో వర్షాలు పడితే ఆనకట్ట మరింత కుంగి కొట్టుకుపోయే అవకాశం ఉంది. దీంతో అధికారులు నాలుగేళ్లుగా పాలిథిన్ కవర్లు కప్పి ఆనకట్టను కాపాడుతున్నారు. అయితే గతేడాది పోలిస్తే ఈ సారి మరో వంద మీటర్ల మేర ఆనకట్ట కుంగింది. దీంతో స్థానికులు, ఆయకట్టు రైతులు (Farmers) ఆందోళన చెందుతున్నారు.
Kumuram Bheem Project | కొట్టుకుపోయే ప్రమాదం
భారీ వర్షాలు(Heavy Rains) కురిసి, వరద పోటెత్తితే ఆనకట్ట కొట్టుకుపోయే అవకాశం ఉందని రైతులు అంటున్నారు. దీంతో ప్రాజెక్టు పరిసర ప్రాంతాల ప్రజల ఆందోళన చెందుతున్నారు. అయితే ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో మరమ్మతులు చేపట్టడం లేదని అధికారులు చెబుతున్నారు. మరోవైపు కాల్వల నిర్మాణం కూడా పూర్తిస్థాయిలో జరగకపోవడంతో ఆయకట్టుకు నీళ్లు అందడం లేదు. ప్రభుత్వం (Government) స్పందించి ఆనకట్ట మరమ్మతులకు నిధులు మంజూరు చేయాలని ప్రజలు కోరుతున్నారు.